Connect with us

Literary

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తానా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

Published

on

సెప్టెంబర్ 9 వ తేదిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం ప్రముఖ తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన తెలుగు వైభవ గీతాన్ని, ప్రముఖ సంగీత దర్శకులు నేమాని పార్థసారథి స్వరపరచగా, మధుర గాయకులు ఎస్. పి. బాలు గానం చేసిన ప్రత్యేక దృశ్య గీతంతో సభను ప్రారంభించారు. ముందుగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రముఖ సాహితీవేత్త కాళోజి కి ఘన నివాళులర్పించి స్వాగతోపన్యాసం గావించారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె. వి. రమణాచారి అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలను, తానా చేస్తున్న భాషా సేవకు ధన్యవాదాలను తన సందేశంలో తెలియజేశారు. తెలుగు భాషకోసం, తెలంగాణా సంస్కృతి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులు, తెలంగాణా సాంస్కృతిక సారధి అయిన రసమయి బాలకిషన్ అన్నారు. విశిష్ఠ అతిధిగా పాల్గొన్న ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలంగాణా లో జన్మించిన సాహితీవేత్తలను గుర్తుచేసుకుంటూ ప్రజలందరికి తెలంగాణా భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు గారి కుమార్తె ప్రముఖ విద్యావేత్త, చిత్రకారిణి, తెలంగాణా రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు సురభి వాణీ దేవి ముఖ్య అతిధిగా పాల్గొని పి. వి. గారి కుటుంబ నేపధ్యాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని, సాహిత్యాభిలాషను, స్నేహితులతో ఆయన మెలిగిన తీరును ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రమంతటా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో, పరదేశం లో ఉంటూ కూడా మాతృభాష మీద మమకారంతో అంతర్జాలం వైవిధ్యభరితంగా తానా ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచిన కవి, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ తెలంగాణా ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాన్ని తన రచనలలో పొందుపరచి, నిజాం ప్రభుత్వ దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలాన్ని ఎత్తి, గళాన్ని విన్పించి, పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు కాళోజీ నారాయణ రావు జయంతిని తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం అన్నారు.

పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు:   

శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు, మాజీ ప్రధాని, బహు భాషావేత్త గారికుమార్తె – సురభి వాణీ దేవి

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులు గారి కుమారుడు –  డా. సురవరం కృష్ణ వర్ధన్  

శ్రీ సుద్దాల హనుమంతు, ప్రజాకవి, కళాకారుడు గారి కుమారుడు – డా. సుద్దాల అశోక్ తేజ

డా. పాకాల యశోదారెడ్డి, ప్రముఖ రచయిత్రి, కవయిత్రి గారి కుమార్తె – డా. లక్ష్మి పాకాల

డా. పల్లా దుర్గయ్య, ప్రముఖ కవి, పరిశోధకుడు, విమర్శకుడు గారి కుమారులు – డా. పల్లా రత్నాకర్, డా. పల్లా శ్యామసుందర్   

పద్మభూషణ్ డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గారి మనవడు సందడి లయచరణ్

శ్రీ దాశరథి రంగాచార్య, ప్రముఖ తెలంగాణా సాహితీవేత్త గారి కుటుంబం తరపున మడిపల్లి దక్షిణా మూర్తి

తెలంగాణ గడ్డపై జన్మించిన ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను, ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహ రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను ఈ సభలో వారి కుటుంబ సభ్యులే పాల్గొని పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని అంటూ డా. తోటకూర ప్రసాద్ పాల్గొన్నవారందరికి, సభను విజయవంతం చేసినవారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected