ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి ఎప్పటికప్పుడు ఉదారతను చాటుతూనే ఉన్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తి తాళ్లూరి భారతి దేవి ఫిబ్రవరి 19, 2022 న కాలం చేసినప్పటి నుంచి సేవాకార్యక్రమాలలో సింహభాగం తన తల్లి పేరు మీద చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుబయట విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు కావాలంటూ పదవీ విరమణ గాంచిన ప్రిన్సిపల్ సిద్దులు తిప్పన జయశేఖర్ తాళ్ళూరి గత ఇండియా ట్రిప్ లో ఉన్నప్పుడు సంప్రదించారు.
అడిగిందే తడవుగా జయశేఖర్ తాళ్ళూరి (Jayasekhar Talluri) కుటుంబానికి చెందిన శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ (Talluri Panchaksharaiah Charitable Trust) ద్వారా తన తల్లి తాళ్లూరి భారతి దేవి జ్ఞాపకార్ధం సుమారు 50 సిమెంట్ బెంచీలు అందించి వితరణ చాటుకున్నారు.
అనంతరం భద్రాచల ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జయశేఖర్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ఈ మన్యం ప్రాంతంలో సహాయం చేయడానికి ఎప్పుడైనా సరే ముందుంటామన్నారు. తాళ్లూరి భారతి దేవి గారికి కూడా ఇతరులకు సహాయం చేయడం, ప్రత్యేకంగా విద్యకి సంబంధించిన విషయాల్లో తోడ్పడడం ఇష్టం అన్నారు.
ఈ సందర్భంగా జయశేఖర్ తాళ్ళూరి ని అలాగే తన తండ్రి తాళ్ళూరి పంచాక్షరయ్య ని శాలువా మరియు పూలదండలతో సన్మానించారు. అడగ్గానే వెంటనే మంచి దృక్పథంతో స్పందించిన జయశేఖర్ తాళ్ళూరి ని విశ్రాంత ప్రధానాచార్యులు సిద్దులు తిప్పన సభికుల మధ్య నిత్యసేవాతత్పరులు అంటూ అభినందించారు.
ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన సిద్దులు తిప్పన, లక్ష్మీనారాయణ చావా, వంశీకృష్ణ, శ్రీనివాస్ చిగురుమళ్ల, శంకర్ రెడ్డి బుసిరెడ్డి, జగదీష్, దేశప్ప, నవీన్ తదితరులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి కృతజ్ఞతలు తెలియజేశారు.