అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం కోమటిని ఎన్నారై తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ గా నియమించారు. జయరాం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.
అప్పటిలో ఏపీ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చాలా విస్తృతంగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజేషన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే జయరాం తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా వెన్నంటే ఉంటూ టీడీపీ కార్యక్రమాలను అమెరికాలో సమన్వయం చేస్తుండడంతోపాటు ప్రత్యేకంగా ఈ మధ్యనే అమెరికాలోని 40 నగరాలలో తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ గా జయరాం కోమటి ని నియమిస్తున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు సంతకంతో కూడిన లేఖను తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పై ఏప్రిల్ 12న మీడియాకి విడుదల చేసారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జయరాం సేవలను గుర్తించి ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ గా నియమించడంతో అమెరికాలోని టీడీపీ అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు, తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాం కి అభినందనలు తెలియజేసారు.