ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి ఇటు తానా ద్వారా అటు తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలాగే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భూరి విరాళ దాతగా కూడా ఎన్నోసార్లు చాటుకున్నారు.
ఇందులో భాగాంగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో మరోసారి తన ఉదారతను చాటారు జయ్ తాళ్లూరి. ఖమ్మం లోని స్థానిక అన్నం సేవా ఫౌండేషన్ కి సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే సౌర శక్తి విద్యుత్ కేంద్రాన్ని (Solar Power Plant) తన మాతృమూర్తి తాళ్లూరి భారతిదేవి జ్ఞాపకార్ధం ఉచితంగా ఏర్పాటు చేశారు.
దీంతో అన్నం సేవా ఫౌండేషన్ కి ప్రతి నెలా సుమారు 45 వేల రూపాయల విద్యుత్తు బిల్లు కట్టే బరువు బాధ్యతలను తగ్గించారు జయ్ తాళ్లూరి. ఈ అన్నం సేవా ఫౌండేషన్ (Annam Seva Foundation) వారు ఖమ్మం (Khammam) లో సుమారు 270 మంది మానసిక వికలాంగుల పూర్తి బాగోగులు నిరంతరం చూస్తుంది.
ఈ సందర్భంగా జయ్ తాళ్లూరి (Jay Talluri) మాట్లాడుతూ మానసిక వికలాంగుల కోసం నిరంతరం అన్నం సేవా ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు తనను కదిలించాయని, వారి సేవాకార్యక్రమాలు అభినందనీయామంటూ అన్నం శ్రీనివాస్ మరియు టీంని అభినందించారు.
ఈ సౌర శక్తి విద్యుత్ కేంద్రం ఏర్పాటులో సహకరించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ (Venkata Ramana Yarlagadda), తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) మరియు వారి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే ఈ ప్రాజెక్ట్ సఫలీకృతం అవడంలో తోడ్పడిన డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ (District NRI Foundation) నాగేశ్వరరావు బండి, రంగారావు మరియు వారి టీంని అభినందించారు. ఎప్పటిలానే అవసరం అనగానే వెంటనే ఉదారంగా స్పందించి ఈ బృహత్కార్యాన్ని పూర్తి చేసిన జయ తాళ్లూరి మరియు తానా వారిని ఖమ్మం వాసులు అభినందిస్తున్నారు.