భూదానం! మన సమకాలీన జీవనవిధానంలో ఈ పదాన్ని దాదాపు మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే అప్పట్లో మన ముందుతరంలో కమ్యూనిస్టులు, పెద్ద పెద్ద జమీందారీలు మాత్రమే భూదానం చేసేవారు. కానీ ఇప్పుడు దానం సంగతి దేవుడెరుగు, ఒక సెంటు స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు భూంఫట్ అని కబ్జా చేసే రోజులు.
ఇలాంటి రోజుల్లో కూడా అప్పుడప్పుడు మనుషుల్లో దానగుణం ఇంకా సజీవంగానే ఉంది అని కొన్ని సందర్భాలు గుర్తు చేస్తుంటాయి. అలాంటి ఒక సందర్భమే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి ఉదారత ద్వారా బయటపడింది.
వివరాలలోకి వెళితే… తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని జయ్ తాళ్లూరి స్వగ్రామం ఇరవెండి లో వ్యవసాయ రైతుల కోసం ధాన్యం నిల్వ చేసుకునే గిడ్డంగి (గోదాము) నిర్మాణానికి సుమారు 70 నుంచి 80 లక్షల విలువ చేసే సొంత భూమిని జయ్ తాళ్లూరి దానం చేశారు.
దీంతో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం వారు నాబార్డు నిధులతో పాటు జయ్ తాళ్లూరి సహాయంతో బూర్గంపహాడ్ మండలం మొత్తానికి సరిపడే గిడ్డంగి (Warehouse) ని నిర్మించారు. అలాగే రైతులు తమ పంటలను ఇబ్బంది లేకుండా నిల్వ చేసుకునేలా ఏర్పాటు చేశారు.
కొన్ని వారాల క్రితం ఇండియా ట్రిప్ లో జయ్ తాళ్లూరి చేతుల మీదుగా ఈ గిడ్డంగిని కూడా ప్రారంభించడం జరిగింది. భూమిని దానం చేయడమే కాకుండా 10 శాతం నిర్మాణ ఖర్చులు కూడా భరించిన జయ్ తాళ్లూరి ని బూర్గంపహాడ్ మండల రైతులందరూ ముక్తకంఠంతో అభినందించారు.
ఇందులో భాగంగానే తానా (Telugu Association of North America) రైతు కోసం ప్రాజెక్ట్ తరపున 300 మంది స్థానిక రైతులకు (Farmers) ప్రత్యేకంగా వ్యవసాయ పనుల నిమిత్తం వాడే భద్రతా కిట్లు స్థానిక పెద్దల చేతుల మీదుగా జయ్ తాళ్లూరి(Jay Talluri) అందించారు.
అదే ఇండియా ట్రిప్ లో ఇరవెండి గ్రామంలోని పాఠశాలకు 4 గదుల నిర్మాణం గావించి ప్రారంభించారు జయ్ తాళ్లూరి. అలాగే మిగతా పాఠశాల (Upper Primary School) భవనాన్ని కూడా ఐ.టీ.సి భద్రాచలం సహకారంతో ఆధునీకరించడం అభినందనీయం.
ఈ రెండు సందర్భాల్లో జయ్ తాళ్లూరి మాట్లాడుతూ.. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన మాతృదేవత తాళ్లూరి భారతిదేవి జ్ఞాపకార్ధం ఈ సేవలు చేస్తున్నట్లు వివరించారు. తన పితృమూర్తి తాళ్లూరి పంచాక్షరయ్య ద్వారా దానగుణాన్ని వారసత్వంగా తీసుకున్నామన్నారు.
అలాగే ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, శ్రీనివాస్ బిక్కసాని, వంశీ కృష్ణ వల్లూరుపల్లి, బూర్గంపహాడ్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు, ఇరవెండి పంచాయతీ ప్రెసిడెంట్, పాఠశాల సిబ్బంది తదితరులకు జయ్ తాళ్లూరి కృతజ్ఞతలు తెలిపారు.