Connect with us

Literary

అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం @ Hyderabad: Vanguri Foundation of America, Sri Samskrutika Kalasaradhi – Singapore, వంశీ ఇంటర్నేషనల్ – India

Published

on

Hyderabad: ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ (Vanguri Foundation of America) ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్’ (Sri Samskrutika Kalasaradhi – Singapore) మరియు ‘వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ (Hyderabad), శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా “అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం” కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనము’, 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ (Acharya Shalaka Raghunath Sharma) గారికి ‘రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార’ ప్రదానము డా. బులుసు అపర్ణ (Dr. Bulusu Aparna) చే ప్రత్యేక ‘మహిళా అష్టావధానము’ మొదలైన అంశాలతో ఈ ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ (Buddha Prasad), విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల (Jonnavithula), కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah), తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు (Veldanda Nithyananda Rao), ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి (Vamaraju Satyamurthy) తదితరులు హాజరయ్యారు.

ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో,  కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.

తదనంతరం ఖతార్ (Qatar) నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి (Vikram Sukhavasi) నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో ఖతార్ దేశ రాజధాని దోహా (Doha) మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన “అంతర్జాతీయ కవి సమ్మేళనం”లో ఆస్ట్రేలియా (Australia), ఖతార్ (Qatar), దక్షిణాఫ్రికా (South Africa), అమెరికా (USA) మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై (Mumbai), అండమాన్ దీవులు (Andaman Islands) మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు.

వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ‌. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా‌ కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో  పేరెన్నికగన్న కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో  ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా శ్రీ పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆసక్తికరంగా నడిపించారు.

అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మ (Acharya Shalaka Raghunath Sharma) గారిని ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున “రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం” అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు (Acharya Veludanda Nityananda Rao) ప్రత్యేక అతిథిగా  పాల్గొన్నారు. అనంతరం శలాకవారు మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో ‘సమస్యా పూరణం’ అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ “అవధాన కవిత్వం – సమస్యలు” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.

సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ (Dr. Bulusu Aparna) చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా (USA), యుగాండా (Uganda), ఆస్ట్రేలియా (Australia), ఖతార్ (Qatar), అండమాన్ దీవులు (Andaman Islands), ముంబై (Mumbai), విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada) నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది “సంపూర్ణ మహిళా అష్టావధానం”గా ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కవుటూరు రత్నకుమార్ (Kavutur Ratnakumar) వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి (Sailaja Sunkarapalli) ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడి ప్రపంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

error: NRI2NRI.COM copyright content is protected