Connect with us

Education

University of Silicon Andhra: అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధులతో ముఖాముఖి

Published

on

అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందం గురువారం, ఫిబ్రవరి 23న వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ సమావేశం విశ్వవిద్యాలయ అధిపతి డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల స్వాగతోపన్యాసంతో మొదలైంది.

విశ్వవిద్యాలయానికి మాతృసంస్థ అయిన సిలికానాంధ్ర గత రెండు దశాబ్దాలకు పైబడి, స్థానికంగా జాతీయస్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాష, సంస్కృతి, కళల అభ్యున్నతికి చేస్తున్న కృషిని, చేపట్టిన సమాజసేవా కార్యక్రమాలను ప్రతినిధి బృందానికి డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల తెలియజేశారు.

అలానే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అతి త్వరలో ప్రారంభించబోతున్న MS కంప్యూటర్ సైన్స్ కోర్సు గురించి, విశ్వవిద్యాలయం రాబోయే సంవత్సరాలలో చేయబోతున్న కార్యక్రమాల బృహత్ ప్రణాళికలను సభికులకు వివరించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించడానికి విద్యార్థులకు I-20 మంజూరు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి అనుమతి లభించిందని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.

ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ నాన్సీ ఇజో జాక్సన్ మాట్లాడుతూ అమెరికా భారత్ సంబంధాల మెరుగుదలకు సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అతి కొద్ది సమయంలోనే విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను కొనియాడుతూ భవిష్యత్ కార్యాచరణలో కృతకృత్యం కావడానికి తమ బ్యూరో సహాయ సహకారాల్ని అందిస్తుందని ఆవిడ సభాముఖంగా ప్రకటించారు.

ప్రతినిధి బృందంలో బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ డివిజన్ చీఫ్ నాన్సీ సడ్విక్, USAID మిషన్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా, కిమ్ క్లిమౌస్కి, డొమెస్టిక్ ఔట్రీచ్ సీనియర్ అడ్వైజర్, జెనిఫర్ మిల్లర్ మరియు మహిళల ఆర్థిక సాధికారికత సీనియర్ అడ్వైజర్ రాధిక ప్రభు ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం సమావేశానికి హాజరైన ప్రవాస భారతీయులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిపారు.

ఈ సమావేశం సాకారం కావడానికి దోహదం చేసిన అజయ్ భుటోరియాకు సిలికానాంధ్ర యూనివర్సిటీ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. వంద మందికి పైగా విచ్చేసిన సిలికాన్ వ్యాలీ ప్రవాస భారతీయ ప్రముఖులతో స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఆహూతులకు, మీడియా బృందం వారికి, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చివరగా కార్యకర్తలు ఏర్పాటుచేసిన విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected