తెలుగు మిత్రులందరికి నా నమస్కారాలు!
ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను.
ఏ దేశమేగినా భారతీయులమే మనం
జగతి మెచ్చిన ప్రజాస్వామ్యమే కదా మన బలం
ఎందరో దేశ భక్తుల త్యాగమే ఈ ఫలం
ఏమిచ్చి తీర్చగలం మాతృభూమికీ రుణం
ధనవంతుడికి ఆకలి విలువ తెలియకపోవచ్చు. కానీ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్రం అందించిన వారి త్యాగాలను మనం మరచిపోతే ఈ చరిత్ర మనల్ని క్షమించదు. ఎందరో తమ జీవితాలను ఫణంగా పెట్టి, దేశ శ్రేయస్సే పరమావధిగా బ్రతికి, బ్రిటీషు వారికి ధైర్యంగా ఎదురొడ్డి, భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి సర్వ స్వతంత్రురాలిని చేసిన పుణ్యాత్ముల, వీరుల త్యాగాలను మనం మరువలేము. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులన్నీ నాడు ఎందరో త్యాగధనులు వదిలిన తుది శ్వాసలే అనేది నిజం. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉండటం మన అదృష్టం. అత్యున్నత అవకాశాల కోసం ఎన్నో వేల మైళ్ళు దాటి అమెరికా వంటి దేశాలకు వచ్చిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు సాధిస్తున్న అభివృధ్ధి అభినందనీయం. దేశం కాని దేశంలో తెలుగు వారి గొప్పదనాన్ని చాటుతూ వారికి తోడ్పాటునందిస్తూ మన్నన పొందుతున్న ప్రతిష్ఠాత్మకమైన తానా సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం నాకు అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఈ స్వాతంత్రాన్ని గౌరవిస్తూ భారతీయులందరూ ఒకరికి ఒకరు సహాయపడుతూ మరింత వికాసం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జలై 10, 2021 న నేను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో, ఆబాలాగోపాలాన్ని భాగస్వాములను చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నాము. ఈసందర్భంగా తానా కార్యవర్గ సభ్యుల కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజుల్లోనే ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని ప్రాయాల తెలుగు వారికి అవసరమైన విజ్ఞాన, మానసికోల్లాస, వైజ్ఞానిక, సాంస్కృతిక, క్రీడల, భాషాభివృద్ధి పరమైన కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్నన పొందే విధంగా నడుచుకుంటానని మాట ఇస్తూ అందరికీ మరొక్క సారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..
మీ.. అంజయ్య చౌదరి లావు
తానా అధ్యక్షులు