ఆగస్టు 15 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రాజాం లోని శ్రీనివాస్ కంప్యూటర్స్ సంయుక్త కలయికలో రాజాం నియోజక వర్గ పరిధిలో నడుస్తున్న బాలవికాస్ కేంద్రాల నిర్వాహకులు, శిక్షకులు మరియు విద్యార్థులచే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా ప్రెసిడెంట్ శ్రీ అంజయ్య చౌదరీ లావు గారిని, తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకట రమణ యార్లగడ్డ గారిని సభకి విఛేసిన వక్తలు, బాలవికాస్ కేంద్రాల నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా మాజీ విప్ శ్రీ కూన రవి కుమార్ గారు, ప్రముఖ విద్యావేత్త శ్రీ పొట్ట సత్యన్నారాయణ గుప్తా గారు, శ్రీకాకుళం జిల్లా ప్రైవేట్ పాఠశాలల ప్రధాన కార్యదర్శి శ్రీ గట్టి పాపారావు గారు, పొందూరు ZPDC శ్రీ శంకరరావు గారు పాల్గొన్నారు.
ప్రారంభ ఉపన్యాసం చేసిన బాలవికాస్ కేంద్రాల నిర్వాహకుడు శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొత్తం 15 బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఈ బాలవికాస్ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం 1వ తరగతి నుండి 6వ తరగతి విద్యార్థులకు చక్కని విద్యతో బాటుగా నైతిక విలువలను, మానసిక శారీరక వికాసాన్ని పెంపొందించడం ఈ బాలవికాస్ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పిల్లలకు శ్లోకాలు, పాటలు, నీతి కథలు మొదలగున్నవి నేర్పించడం జరుగుతోందని తెలిపారు. రాజాం మండలం లో 11, సంతకవిటి మండలం లో 2 , రేగిడి ఆముదాలవలస మండలం లో 3 కేంద్రాలను ప్రారంభించామని, ఈ కేంద్రాలలో ఇప్పటి వరకు సుమారు 280 కి పైగా చిన్నారులు శిక్షణ పొందుతున్నారని, ఈ బాలవికాస్ కేంద్రాలకు కావలసిన మౌలిక సదుపాయాలను (బ్లాక్ బోర్డ్, పుస్తకాలు, పలకలు, పెన్సిల్లు , పెన్నులు, చేతి రాత పుస్తకాలు అలాగే ఆట వస్తువులైన కేరంబోర్డ్ , చెస్ బోర్డ్స్ , రింగ్ లు మొదలగున్నవి.) అమెరికా లో ఉన్నటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారు అందివ్వడమే కాకుండా బాలవికాస్ శిక్షకులకు గౌరవ భృతిని కూడా ఇవ్వనున్నారని తెలియచేసారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ విప్ శ్రీ కూన రవి కుమార్ గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను, శ్లోకాలు, పాటలు , మానసిక శారీరక వికాసం అందించాలి అనే ఆలోచన తో బాలవికాస్ కేంద్రాలు ప్రారంభించడం చాలా చక్కని ఆలోచన అని తానా వారిని మరియు బాలవికాస్ కేంద్రాల నిర్వాహకుడు శెట్టి శ్రీనివాసరావు లను అభినందించారు. రాజాంలో మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లా మొత్తం ఇలాంటి బాలవికాస్ కేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
మరొక అతిధిగా విచ్చేసిన శ్రీ పొట్ట సత్యన్నారాయణ గుప్తా గారు బాలవికాస్ కేంద్రాల నిర్వహణపై చాలా ఆసక్తి కనబర్చి తనవంతు సహకారం అందివ్వడమే కాకుండా బాలవికాస్ కేంద్రాల శిక్షకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కంప్యూటర్స్ విద్యార్థులు చక్కటి సేవలను అందించారు. బాలవికాస్ కేంద్రాల శిక్షకులు, విద్యార్థులందరూ తానా వారికి కృతఙ్ఞతలు తెలియచేసారు.