ఆంధ్ర కళా వేదిక – ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం సందర్భంగా ఖతార్ లోని తెలుగు వారందరి కోసం “కార్తీకమాస వనభోజనాలు” కార్యక్రమాన్ని శుక్రవారం అక్టోబర్ 28న మొట్టమొదటి సారి మెసయిద్ లోని ఫామిలీ పార్క్ లో నిర్వహించారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్కరోజు వ్యవధిలోనే ౩౦౦కి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకుని రికార్డు సృష్టించారు అని తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమానికి సుమారు 450 మంది హాజరయ్యారని, ఎండని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా విచ్చేసిన పిల్లా పెద్దా అందరూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారని అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులుకి (Sponsors), సహకరించిన స్వచ్ఛంద సేవకులకి (Volunteers) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్ర కళా వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రం సుఖవాసి మాట్లాడుతూ పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణకుమార్ గారు, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుండి శ్రీమతి రజని మూర్తి గారు, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఖాజా నిజాముద్దీన్ గారు, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ Luthfi గారు, శ్రీ సత్యనారాయణ మలిరెడ్డి గారు, శ్రీ గొట్టిపాటి రమణ గారు, శ్రీ హరీష్ రెడ్డి గారు మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారన్నారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో (తంబోలా, టగ్ ఆఫ్ వార్, ట్రెజర్ హంట్, ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు) గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. లక్కీ డ్రా లో గెలిచిన మొదటి ముగ్గురికి రెండు గ్రాముల బంగారు నాణేలు, ఉసిరి చెట్టు కొమ్మల క్రింద రుచికరమైన సాంప్రదాయ విందు భోజనం మరియు మసాలా మజ్జిగ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
ఈ వనభోజనాలను సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు శ్రీ విక్రమ్ సుఖవాసి, శ్రీ కెటి రావు, శ్రీ వీబీకే మూర్తి, శ్రీమతి శిరీషా రామ్, శ్రీ సాయి రమేష్, శ్రీ సోమరాజు మరియు శ్రీ రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరికి కృతజ్ఞతలు తెలియజేసి గ్రూప్ ఫోటో తో కార్యక్రమాన్ని ముగించారు.