Connect with us

Devotional

ప్రవాహంలా సాగిన అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన: Hindu Temple of Bloomington Normal, Illinois

Published

on

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ నార్మల్ లో స్థానిక శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో (హిందూ టెంపుల్ ఆఫ్ బ్లూమింగ్టన్ నార్మల్ ) “అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన” సంగీత కార్యక్రమం “కళ్యాణి స్కూల్ అఫ్ మ్యూజిక్” ఆధ్వర్యం లో దేవాలయ యాజమాన్య సౌజన్యంతో, సంగీత విద్యార్థులు 108 సంకీర్తనలు అనర్గళంగా ఆలపించగా, ఆద్యంతం ఆహుతుల్ని పరవిశింప చేస్తూ ఉదయం పది గంటలకు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ సంగీత ఝరి ఖండాంతరాలు దాటి ప్రవాహంలా సాగిపోయింది.

‘కళ్యాణి స్కూల్ అఫ్ మ్యూజిక్’ గురువు శ్రీమతి కల్యాణి అమరవాది గారు, ఈ కార్యక్రమాన్ని, విద్యార్థులు స్వామి కి సంకీర్తనార్చన చేస్తూ, ఆలయానికి విరాళాలు కూడా సేకరించేటట్లు గా ప్రత్యేకించి చక్కటి ప్రణాళికతో కళాకారుల్ని సప్తస్వరాలకు అణుగుణంగా ఏడు గ్రూప్ లుగా విభజించి వయస్సుకు తగ్గట్టుగా కీర్తనలు కేటయించారు. భారత దేశం నుండి మరియు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి అంతర్జాలంలో జూం లింక్ ద్వారా కీర్తనలు ఆలపించగా, బ్లూమింగ్టన్ నార్మల్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయ విద్యార్థులు ప్రత్యక్షంగా ఆలయానికి విచ్చేసి సంకీర్తనార్చన గావించారు.

ప్రారంభ కీర్తనగా “మేదిని జీవుల కావ మేలుకోవయ్యా!” అంటూ ఆ దేవదేవుని మేలుకొలుపగా ఈ సంగీత ప్రవాహం ఆరు భాషలలో , డెబ్బై రెండు రాగాలలో స్వరపరచి ,ముప్పది కి పైగా వాగ్గేయకారులు (త్యాగ రాజు, శ్యామా శాస్త్రి , పురందర దాసు, తాళ్ళపాక అన్నమాచార్యులు, భక్త రామదాసు మొ|| వారు )రచించిన కీర్తనలతో, వివిధ తాళాల లో ఇరవై ఏడు మంది విద్యార్థులు (నాల్గు సం|| చిన్నారుల నుండి మొదలుకుని ముప్పది సం|| వయస్సు కల కళాకారులు) హృద్యంగా, తన్మయత్వంతో ఆలపించారు. చివరగా “రామచంద్రాయ జనక రాజజా మనోహరయా” అనే మంగళ హారితి కీర్తనతో పూర్తి చేసారు.

విశేషంగా ప్రతి ఒక సంకీర్తన ఆలాపన తర్వాత ఒక తామర పుష్పంతో మహిళలు స్వామి కి పుష్పమాల అల్లడం కూడా జరిగింది. 108 తామర పుష్పాల మాలను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ దేవీ భూదేవీ సహిత ప్రసన్న వేంకటేశ్వర స్వామికి అర్చకులు అలకరించారు. అనంతరం శ్రీమతి కల్యాణి అమరవాది “మగువల రాజుకు మంగళం” అను మంగళ హారతి కీర్తనతో “అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన” కార్యక్రమం ‘షోడషోత్తర శత నామ సంకీర్తనార్చన ‘(116) కార్యక్రమంగా అందరిని మంత్రముగ్ధులను చేసింది.

ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు స్థానిక పిల్లల వైద్య నిపుణులు శ్రీ సంజయ్ సక్సేనా గారు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగీత కళాకారులందరికి ట్రోఫి లు మరియు ప్రశంసా పత్రాలను అందచేసారు. ఈ సంకీర్తనార్చన యూట్యుబ్ చానల్ లో ప్రపంచం నలుమూలల నుండి అందరు అంతర్జాలంలో నిరంతరం ప్రత్యక్షంగా వీక్షించేలా ఆలయ కమిటీ, పూర్తిగా 10 గంటల 45 నిమిషాల నిడివి కల కార్యక్రమం ఆలయం తరపున ఇంకా అందుబాటులో ఉంచారు.

ఈ కార్యక్రమానికి స్థానికులు నగదు రూపంలో మరియు ఇతర భక్తులు ఆన్ లైన్ ద్వార విరాళాలు అంద జేసారు. ఈ విరాళాలను భక్తుల కోరిక మేరకు, ఆలయం లో వేంచేసిన ఉత్సవ , మూల మూర్తుల ఆభరణాల నిమిత్తమై వినియోగం చేస్తామని ఆలయ కమిటీ వారు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సంగీత కళాకారుల తల్లి తండ్రులు మరియు ఆలయ కమిటీ సభ్యులు అహర్నిశలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected