Connect with us

Cultural

బలిపీఠం: ఆలయపురుషుని నాభి ప్రదేశం, ఆలయానికి కేంద్రస్థానం

Published

on

దేవానాం దేవస్య వా ఆలయా‘ – ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయము.

దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తయిన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు. కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ (కుక్క), కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం.

విష్ణుతిలక సంహిత బలిపీఠాలను శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది. మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి. తిరుమల వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది. విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది. దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.

ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే. మానవులు దాన్ని భుజించకూడదు.

ఓం నమః శివాయ! హర హర మహదేవ శంభో శంకర!!

– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected