ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆరోగ్యవంతమైన అమ్మాయి, ఆరోగ్యవంతమైన అమ్మ’ అనే నానుడి స్ఫూర్తిగా 9 నుండి 18 సంవత్సరాల వయసున్న గ్రామీణ ఆడ పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, తద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అనే ఉద్దేశంతో ‘హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్’ అనే ఈ కొత్త ప్రోగ్రాంని రూపొందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మర్చి 8న గ్రామీణ ఆడపిల్లల కోసం మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు స్కాలర్స్ కాన్వెంట్ లలో ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థినులు హాజరైన ఈ కార్యక్రమానికి దాత ప్రియాంక వల్లేపల్లి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిష్టు డాక్టర్ తేజస్వి గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటిని నివారించటం పట్ల అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థినులుకు రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం చెక్ చేసి విటమిన్స్, కాల్షియమ్ టాబ్లెట్స్, శానిటరీ పాడ్స్ పంపిణి చేసారు. రక్తహీనతను అధిగమించే ఆహార డైట్ వివరాలు తెలియచెప్పారు.
చెరుకూరి చాముండేశ్వరి మాట్లాడుతూ ఆడపిల్లలు 9 నుంచి 14 సంవత్సరముల మధ్య HPV వాక్సిన్ 6 నెలల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవటం వల్ల అధికశాతం మహిళలలో వచ్చే సెర్వికల్ కాన్సర్ ను నివారించవచ్చు అని చెప్పారు. టీచర్స్ కూడా విద్యార్థినులుకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటే బాగుంటుంది అన్నారు.
ఈ నూతన ప్రాజెక్ట్ కి సమన్వయకర్తలుగా తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, తానా నార్త్ సెంట్రల్ ప్రాంతీయ కార్యదర్శి సాయి బొల్లినేని మరియు పద్మజ బెవర వ్యవహరించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు మరియు స్వచ్ఛ నాగాయలంక సేవా సభ్యులు ఈ ప్రోగ్రాం విజయవంతం అవ్వటానికి తమ సహాయ సహకారాలను అందించారు.