ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ గత సంవత్సరం 2022 లో ‘ఆరోగ్యవంతమైన అమ్మాయి, ఆరోగ్యవంతమైన అమ్మ’ అనే నానుడి స్ఫూర్తిగా ‘హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 న తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి మరియు వారి సతీమణి ప్రియాంక వల్లేపల్లి దాతలుగా స్వేచ్ఛ ఫర్ ఐటీ వారితో సంయుక్తంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ‘హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్’ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఆరోగ్య కేంద్రానికి గచ్చిబౌలి సమీప ప్రాంతాల్లోని పేదలు, ఇల్లిల్లు తిరిగి పనిచేసుకునే మహిళలు సుమారు 600 మందికి పైగా తరలివచ్చారు. అందరికీ ఎనీమియా, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు చేసి విటమిన్స్, 3 నెలలకు మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో అందరూ ఆనందంగా తిరిగివెళ్ళారు.
మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటిని నివారించటం అనే ఉద్దేశంతో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, తద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి అనే ఆలోచనను ఆచరణ రూపంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న దాతలు శశికాంత్ వల్లేపల్లి మరియు ప్రియాంక వల్లేపల్లి లను అందరూ అభినందించారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు తానా లీడర్షిప్ సహకారానికి గాను స్వేచ్ఛ ఫర్ ఐటీ నుంచి కిరణ్ యార్లగడ్డ మరియు ప్రవీణ్ కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే డాక్టర్ రూప వేములపల్లి, సాయి ప్రసాద్, అమృత బెడదల తదితర తోటి దాతలను తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి అభినందించారు.