మేరీలాండ్ రాష్ట్రంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో జనవరి 26వ తారీఖున సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వర్జీనియా, మేరీలాండ్ మరియు వాషింగ్టన్ డి.సి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు సుమారు 1400 మంది పాల్గొనగా గైతెర్స్ బర్గ్ లోని హైస్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా, మొట్టమొదటిసారి యల్ ఈ డి డిజిటల్ స్క్రీన్స్ ద్వారా స్పాన్సర్స్ వీడియో ప్రకటనలు, మూవీ ప్రోమోస్, పండుగ శుభాకాంక్షలు తదితర ప్రజంటేషన్స్ అందరిని అయ్యారే అనిపించాయి. ఈవిధంగా డిజిటల్ స్క్రీన్స్ అందించిన ఎన్నారై స్ట్రీమ్స్ వారిని అందరూ అభినందించారు. ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు చూడముచ్చటగా ఉన్నాయి. ముగ్గుల పోటీల విజేతలకు బెస్ట్ బ్రైన్స్ వారు బంగారు నాణాలు బహుకరించడం విశేషం. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. వీలునామా ప్రణాళికా, ఆరోగ్య భీమా, ఇషా యోగా తదితర సదస్సులు ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు అందించారు.
ఆబాలగోపాలం అంకిత భావంతో పాల్గొన్న ఈ వేడుకలలో, సాంప్రదాయ మరియు సినీ గీతాలతో కూడిన నృత్య ప్రదర్శనలు, పసందైన సంభాషణలతో కూడిన స్కిట్స్ పోటా పోటీగా మైమరపించాయి. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి మరియు సాహిత్య వింజమూరి తమ సమయస్పూర్తి, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో ప్రేక్షకులకు ప్రదర్శనలను మరింత దగ్గర చేసారు. ఈ సంవత్సరం విన్నూత్నంగా వివిధ ఉత్పత్తులకి సంబంధించిన పాత, క్రొత్త కమర్షియల్స్ ని ఉపయోగించి సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. యాష్ బర్న్, వర్జీనియా సంగీత పాఠశాల నోట్స్ అండ్ బీట్స్ స్థాపకురాలు వీణ పందిరి మరియు వారి శిష్యబృందం తమ సంగీత ప్రతిభతో ప్రేక్షకులకు వీనులవిందు చేశారు. పారడైజ్ ఇండియన్ క్యూసైన్ శ్రీధర్ వన్నెంరెడ్డి గారు సంక్రాతి పండుగ స్పెషల్ స్వీట్స్, అరిసెలు, పూతరేకులు, కాజాలు, పూర్ణాలు వంటి పిండివంటలతో కూడిన పసందైన విందు భోజనం అందించారు.
ఈ కార్యక్రమానికి విరాళంగా నిధులు సమకూర్చిన డైమండ్ స్పాన్సర్స్ ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అమరావతి ఉండవల్లి పాపారావు గారు మరియు సతీష్ చుండ్రు గారు, సోమిరెడ్డి లా గ్రూప్ సంతోష్ సోమిరెడ్డి గారు, న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్సు అపరాజిత పమిడిపాటి గారు, అలాగే టీడీపీ స్టేట్ సెక్రటరీ మన్నవ సుబ్బారావు గారిని అధ్యక్షులు సత్యనారాయణ మన్నె ఆధ్వర్యంలో జిడబ్ల్యుటిసిఎస్ కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడుతూ జులై 4, 5, 6 తేదీలలో జరగనున్న తానా 21వ మహాసభలకు జిడబ్ల్యుటిసిఎస్ కోహోస్టు గా వ్యహరిస్తుందని తెలియజేస్తూ, తానా అధ్యక్షులు సతీష్ వేమన గారి తరపున అందరిని మహాసభలకు ఆహ్వానించారు.
చివరిగా అధ్యక్షులు సత్యనారాయణ మన్నె, కార్యవర్గ సభ్యులు సుధా పాలడుగు, తనూజ గుడిసేవ, నాగ్ నెల్లూరి, అనిల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, కిరణ్ అమిరినేని, కృష్ణ గుడిపాటి, విజయ్ అట్లూరి, కార్తీక్ నాదెళ్ళ, ప్రవీణ్ దాసరి, శ్రీధర్ మారం, చంద్ర మలవతు, కిషోర్ దంగేటి, కృష్ణ లామ్, అవినాష్ కాసా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆహుతులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేసారు.