Washington DC: అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా స్వర్ణోత్సవ సంస్థ, బ్రహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో, పికెల్ బాల్ (Pickle ball) టోర్నమెంట్ నిర్వహించారు. 20 నుండి 60 ఏళ్ళ వారి వరకూ వందలాది మంది క్రీడాకారులు పాల్గొనగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించామని అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) తెలిపారు.
క్రీడలు దైనందిన జీవితంలో ముఖ్య భాగమని అందుకే ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికెల్ బాల్ (Pickle ball) క్రీడల పోటీని ప్రధమంగా నిర్వహించామన్నారు. దేశం, వయసు.. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని, జీవితంలో గెలుపోటములు భాగమేనని..
ఓడిన ప్రతి సందర్భంనుండి నేర్చుకుంటూ, తీర్చిదిద్దుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవటం యువతకు దిశానిర్దేశామని కార్యవర్గసభ్యులు, అతిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 11 గంటల వరకూ సాగిన ఈ పోటీల్లో ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్ ఊపిరి బిగబట్టే చూసేంత హోరాహోరీగా సాగాయి.
చిన్నారులు, పెద్దలు ఇలా పాల్గొన్న వీక్షించిన ప్రతిఒక్కరూ GWTCS సంస్థ , కార్యవర్గ సభ్యులను ఈ ప్రప్రధమ ప్రయత్నాన్ని అభినందించారు. స్థానిక క్రీడాకారులు, యువతతో ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది.అందరికి అల్పాహారం, టీ ఏర్పాటు చేశారు. ప్రవాస సంఘాలైన తానా (TANA), ఆటా కార్యవర్గసభ్యులు అతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆదిత్య, శశాంక్ ప్రధమ విజేతలుగా, తరిధ్, అర్ష్ ద్వితీయ విజేతలుగా బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకారమందించిన ప్రతి ఒక్కరికీ, దాతలకు, మీడియా వారికి మరియు ఈ కార్యక్రమ సమన్వయకర్తలైన రాజేష్ కాసారనేని, సుశాంత్ మన్నే, శివాజీ మేడికొండ, విజయ్ అట్లూరి, శ్రీధర్ వాసిరెడ్డి, దుర్గా కొడాలి లకు సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తూ సంస్కృతీ, భాష, యువతకు వేదికగా మరిన్ని కార్యక్రమాలతో ఈ ఒరవడిని కొనసాగిస్తామని తెలిపారు.