ఫ్లోరిడా, అమెరికా: ఉన్నత విద్యను బాలికలకు అందించడమే సంస్థ లక్ష్యమని సామినేని కోటేశ్వరరావు (Samineni Koteswara Rao) అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో గుంటూరు కమ్మజన సేవా సమితి (Kamma Jana Seva Samithi) ఆధ్యరంలో తలపెట్టిన బాలికల వసతి నూతన భవనాల నిర్మాణంలో ప్రవాసాంధ్రుల సహకారంపై సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని సుమంత్ ఈదర, ఈశ్వర్ కనుమూరి, అజయ్ కొల్లా, రవి రావి, వేణు సింగు తదితరులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చ్ యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బాలికల విద్య కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. బాలికల్లో ప్రతిభ ఉన్నా పేదరికం అడ్డంకిగా మారి ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. వారి కోసం కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో వసతి గృహాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ప్రవాసాంధ్రుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. మరింత మంది సహకరించాలని కోరారు.
ఏపీ కాటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం, ప్రతిభ, పేదరికం ఉన్న బాలికలకు వసతి గృహాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ భవన సముదాయాల నిర్మాణాలకు సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ప్రతిభ గల పేద విద్యార్థినులకు కుల, మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం సుమారుగా రూ.30 లక్షలు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. అనాధ బాలికల కోసం ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబురావు దొడ్డపనేని, డాక్టర్ జానకి రామయ్య కాకరాల, ఘంటా పున్నారావు తదితరులు ప్రసంగించారు. కొంతమంది ప్రవాసాంధ్రులు చెక్కుల రూపంలో సామినేని కోటేశ్వరరావుకు విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళి రావి, కోటేశ్వరరావు యార్లగడ్డ, అమర్ అమిరినేని తదితరులు పాల్గొన్నారు.