గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) 2023 సంవత్సరానికి నూతన కార్యవర్గం కొలువు తీరింది. జనార్ధన్ పన్నెల అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు, శ్రీనివాస్ పర్సా బోర్డు ఛైర్మన్ గా బోర్డు సభ్యులు జనవరి నుండి ఛార్జ్ తీసుకున్నారు. మిగతా సభ్యుల వివరాలు క్రింది ఫ్లయర్ లో చూడవచ్చు. ఈ సందర్భంగా అధ్యక్షులు జనార్ధన్ పన్నెల గేట్స్ గురించి మరియు గేట్స్ తో తన అనుబంధాన్ని NRI2NRI.COM తో ఇలా పంచుకున్నారు.
“అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. యావత్ ప్రవాస తెలంగాణ వాసులను మమేకం చేస్తూ, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే దిశలో ప్రారంభమైన గేట్స్ (Greater Atlanta Telangana Society) దశాబ్ద కాలానికి మించి అనేక సేవలను అందిస్తుంది. తెలంగాణ సంస్కృతిని కాపాడేలా, తెలంగాణ ప్రవాసుల్లో సేవాతత్వాన్ని పెంపొందించే దిశలో, అందరి మధ్య సమానత్వం మరియు పరస్పర సౌబ్రాతృత్వం అభివృద్ధి చెందేలా నిర్విరామంగా కృషి చేస్తున్న సంస్థ గేట్స్.
మొదట తెలంగాణ కమ్యూనిటీగా అవతరించి, తెలంగాణ సంస్కృతిని విస్తరింపచేసి, అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్న సంస్థ, తదనంతరం 2015వ సంవత్సరంలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్) గా తెలుగు ప్రజలందరికి చేరువై ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు ప్రజల మన్నలను పొందుతున్నది.
ఇలాంటి తెలంగాణ మాతృ సంస్థలో 2012వ సంవత్సరంలో ఒక గాయకుడిగా పరిచయమై, సంస్థలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నా వంతు సేవలను దశాబ్దానికి పైగా అందిస్తూ, 2015వ సంవత్సరంలో సాంస్కృతిక చైర్ గా బాధ్యతలు స్వీకరించి సంస్థ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరి సహకారంతో విజయవంతం చేసాము. తదనంతరం నా ప్రతిభను, సేవలను గమనించిన గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు 2019వ సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా అవకాశం కలిపించారు.
అదే సంవత్సరం స్పోర్ట్స్ సెక్రెటరీగా కూడా సేవలనందించాను. తదుపరి 2020వ సంవత్సరంలో కోశాధికారిగా, 2021 సంవత్సరంలో సెక్రటరీగా, 2022లో ఉపాధ్యక్షుడిగా ఇలా సంస్థలో బాధ్యతలను చేపట్టి నిరంతరం నిత్య సేవకుడిగా అంకిత భావముతో సంస్థ కు నా సేవలను అందిస్తున్నందుకు 2023లో గేట్స్ బోర్డు సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది. ఈ అవకాశన్ని నాకు కల్పించిన గేట్స్ బోర్డు సభ్యులందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
నేను ఈస్థాయికి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన గేట్స్ వ్యవస్థాపక సభ్యులకు, ప్రస్తుత సలహామండలి సభ్యులకు, ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి, పూర్వ అధ్యక్షులకు, పూర్వ చైర్మన్లకు, పూర్వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు, గేట్స్ కమిటి సభ్యులకు, సహసభ్యులకు, గేట్స్ సభ్యత్వ సభ్యులకు, మరియు గేట్స్ నిర్వహించే కార్యక్రమాలలో అంకితభావముతో సేవలను అందించే ప్రతి ఒక్కరికి శిరస్సువంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తూ మునుముందు గేట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమములో మీరందరు పాలుపంచుకొని విజయవంతం చేస్తారని, అలాగే మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.