అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాకుండా ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.
లలితా అమ్మవారి వెయ్యినామాలు మొత్తం 182 1/2 శ్లోకాలలో నిక్షిప్తం చెయ్యబడ్డాయి. సంవత్సరానికి మొత్తం 365 రోజులు, వెలుగుభాగాన్ని అమ్మవారితోను, చీకటిభాగాన్ని అయ్యవారితోను సమన్వయ పరుచుకొంటే 182 1/2 రోజులు అమ్మవారికి సబంధించినది. అందుకనే వ్యాసులవారు అమ్మవారి వెయ్యినామాలను 18 1/2 శ్లోకాల్లోనే నిక్షిప్తం చేశారు.
“శ్రీ” అక్షరంలో శ-ర-ఈ అనే మూడు అక్షరాలు ఉన్నాయి. ఇవి వరుసగా ఇచ్చాశక్తి, జ్ణానశక్తి, క్రియాశక్తులకు ప్రతీకలు. వీటిమీదే మొత్తం వ్యక్త సృష్ఠి అంతా ఆదారపడి ఉంది. శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ తో మొదలుపెట్టి, శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ, శ్రీ శివా అని మళ్ళీ “శ్రీ” తోనే ప్రారంభింపబడే మూడునామాలతో ముగింపబడింది. అంతే కాదు జన్మకు సబంధించిన శ్రీమాతా నామంతో ప్రారంభింపబది, ముక్తికి సంబంధించిన శివశక్త్యైక్య రూపిణీ అనే నామంతో ముగింపబడడం గూడా ఒక ప్రత్యేకత అని చెప్పాలి.
ప్రతీ మాసంలోను శుక్లపక్షంలో దినదినానికి వెన్నెల వెలుగులు పెరుగుతూ చివరకు పూర్ణిమ వస్తుంది. అందుకని ఈ శుక్లపక్షాన్ని అమ్మవారికి సంబంధించినదినదిగా సమన్వయ పరుచుకోవాలి. కృష్ణ పక్షంలో దినదినానికి చీకటి పెరుగుతూ చివరకు అమావాస్య వస్తుంది. అందుకని కృష్ణపక్షాన్ని అయ్యవారికి సంబందించినదిగా సమన్వయ పరుచుకోవాలి. అమ్మవారికి సంబంధించిన శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమవరకు మొత్తం 15 తిధులుంటాయి. ఈ 15 తిధులను అనుసరించి 15 బీజాక్షరాలు గల మంత్రాన్ని బుషులు దర్శించి, సమన్వయ పరచి ఇచ్చారు. లలిత పంచదశాక్షరి మంత్రం: ” క, ఏ, ఈ, ల, హ్రీం; హ, స, క, హ, ల, హ్రీం; స, క,ల, హ్రీం” ఈ మంత్రాన్నే సంకేత పదాలతో ఒక శ్లోకంలో ఇచ్చారు. “కామే, యోని కమలా, వజ్రపాణి, ర్గుహ హ సా మాతరి, శ్వాభ్ర, మింద్రో, గుహ; స,క,లా, మాయయావృతా”.
సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి. ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా, వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. ఈ నామాలలో ఏకాక్షరి మొదులుకుని పదహారు అక్షరాల సమూహంతో ఉన్ననామాలు ఉన్నాయి. వాటిని తప్పు పలకకుండా పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శుచి, శుభ్రత పాటిస్తే మంచిదని పండితులు పేర్కొంటున్నారు. అవకాశం లేని వారు ఈ నామాలను ప్రతినిత్యం స్మరణ, శ్రవణం చేస్తే కూడా విశేష ఫలితాలు వస్తాయి.
శ్రీ లలిత సహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.