గత జనవరిలో మహామహుల మధ్య కోలాహలంగా గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association) ఏర్పాటు చేసిన సంగతిని NRI2NRI.COM మీ అందరి దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. వ్యవస్థాపకులుగా ఎన్నారై విశ్వేశ్వర్ రెడ్డి కలవల, సహ వ్యవస్థాపకులుగా మల్లారెడ్డి అలుమల్ల, శ్రవణ్ రెడ్డి పాడూరు మరియు ఇండియా విభాగం ప్రెసిడెంట్ గా శ్రీనివాస రెడ్డి పాడూరు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని ప్రకటించారు.
తెలంగాణ సమాజాన్ని ఏకం చేయాలనే మహోన్నత ఆశయం, బలమైన సంకల్పంతో మనమంతా ఏకతాటి పై నడవాలనే ఎన్నారైల ఆకాంక్షల నుంచి మొదలై అందరూ ఏకమై కలసిమెలిసేలా విశ్వవేదిక కు అంకురార్పణ జరుగుతుంది. తెలంగాణ గడ్డపై పుట్టి మహోన్నత ప్రతిభ పాటవాలతో తమ ప్రజ్న ని చాటుతున్న తెలంగాణ సోదరి సోదరులని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపంగా పురుడుపోసుకుంటుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.
నిస్పాక్షిక సేవే లక్ష్యంగా, తెలంగాణ బిడ్డల కష్ట సుఖాల్లో మేము సైతం అంటూ భరోసా కల్పించడమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది. తెలంగాణ బిడ్డలని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలంగాణ సమాజాన్ని ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి, శాశ్వతంగా సేవలు కొనసాగించడానికి ఏర్పాటవుతుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది.
మాతృభూమి ఋణం తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నారైలని ఒక్కటి చేసి సేవా పధంలో సరికొత్తగా ప్రయాణం మొదలు పెడుతుంది. తల్లిపాల రుణం కొంతైనా తీర్చటమే ప్రధాన లక్ష్యంగా సేవే పరమావధిగా తమని కన్న భూమికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, ఎందరికో స్ఫూర్తిగ నిలవాలనే సత్సంకల్పం, దృఢమైన ఆలోచనతో ఊపిరులూదుకుంటుంది. ఇడుపు ఇడుపున జానపదములు ఇంపుగా పూసిన కవనవనంబులు అనే తెలంగాణ చరిత్రని నిజం చేస్తూ సాహిత్య కళాకారులు, సంప్రదాయ జానపద కళలలని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతిని భవిష్యత్తు తరాలకి అందించాలనే సమున్నత ఆశయాన్ని విశ్వ వేదికగా సాక్షత్కరించేలా తొలి ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలంగాణ గౌరవాన్ని పెంపొందించేలా తెలంగాణ బిడ్డల ఐక్యతని చాటేలా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రయాణం మొదలవుతుంది. తెలంగాణ బిడ్డ ఏ చోట ఉన్న వారు ఉన్నత అవకాశాలని ఎక్కడ పొందగలరో ఒక మార్గదర్శికి సంస్థ నిలవనుంది. విద్య , వైద్య , వ్యాపార , న్యాయ , పరోశోధన , సామాజిక అవకాశాలకు వేదికగా, తెలంగాణా బిడ్డలకు సంధానకర్తగా గురుతర బాధ్యతలని తమ కర్తవ్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ భావిస్తుంది.