కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి నెలా రెండవ శనివారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే కార్యక్రమాన్ని మనముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 12వ తేదీన డాక్టర్ కొత్త కాపు స్వరూప రెడ్డి గజల్ విభావరి నిర్వహించారు.
‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలో హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది అంటూ పాడిన గజల్ తో అందరి మన్ననలు పొందారు డాక్టర్ కొత్తకాపు స్వరూప రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ సత్కారంతోపాటు, ప్రపంచంలోని పలు దేశాల్లో గజల్ ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో సత్కారాలు అందుకున్నారు.
ముందుగా తానా సాంస్కృతిక సేవా కార్యదర్శి శిరీష తూనుగుంట్ల స్వాగతోపన్యాసం చేయగా, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఆహూతులందరిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తానా ను డాక్టర్ విజయ్ భాస్కర్ దీర్ఘాశి అభినందించారు. అనంతరం డాక్టర్ కొత్తకాపు స్వరూప రెడ్డి గజల్ విభావరితో అందరినీ అలరించారు.