అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యండమూరి నాగేశ్వరరావు సమన్వయ పరిచారు. ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అమర గాయకుడు ఘంటసాలకు శతవసంతాల నీరాజనాలు అర్పిస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఘంటసాల, ఎన్టీఆర్ ఇద్దరూ యుగపురుషులు. ఒకరు మహానటుడు, మరొకరు మహా గాయకుడు. వారి జీవితాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగంలో ఘంటసాల ఓ వెలుగు వెలిగిన గొప్ప గాయకుడు. ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్. గాన గంధర్వుడు ఘంటసాల పాటలు తెలుగు భాష ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… తెలుగు భాషలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని ఎన్టీఆర్, ఘంటసాల భావితరాలకు అందించారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుగు కిందకు చేర్చి ఇరువురు తెలుగుజాతికి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సాహితీ జగత్తును శాసించారు, సమాజాన్ని కదిలించారన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ.. సినీవినీలాకాశంలో ఘంటసాల ధృవతారగా వెలుగొందారు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజుగా నిలిచారన్నారు. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుపుకునే అవకాశం రావడం మన అదృష్టమన్నారు.
తెలుగు వారి అపర సంగీత నిధి ఘంటసాల ఆలపించిన మధురమైన పాటలను, అలనాటి రంగస్థల నాటక పద్యాలను గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన తీరు ప్రవాస తెలుగు వారిని అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మైనేని రాంప్రసాద్, కంభంపాటి రమణారావు, కోట రామ్మోహన్, వై. శంకర్రావు, పాకాలపాటి కృష్ణయ్య, సాయి కిషోర్ యండమూరి, బండ మల్లారెడ్డి, మిట్టపల్లి రామ్మూర్తి, వినీల్ శ్రీరామినేని, సమంత్ తోటకూర తదితరులు పాల్గొన్నారు.