గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణలో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టింది. గతంలో మాదిరిగానే విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుండే గేట్స్, ఈ సారి తెలంగాణ లోని నిర్మల్ జిల్లా కడెం మండల వరద బాధితులకు వెన్నుగా నిలబడింది.
వివరాలలోకి వెళితే.. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. దీంతో ఇబ్బందులకు గురి అవుతున్న సుమారు 30 కుటుంబాలకు జులై 23ననిత్యావసర సరుకులు అందజేశారు. కూరగాయలు, గోదుమ పిండి, బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు.
ఇండియా ట్రిప్ లో ఉన్న గేట్స్ ఉపాధ్యక్షులు జనార్ధన్ పన్నెల ఆధ్వర్యంలో గేట్స్ కార్యవర్గ సభ్యులు సునీల్ గోటూర్, ప్రభాకర్ మడుపతి, సందీప్ రెడ్డి గుండ్ల, గేట్స్ డైరెక్టర్స్ మరియు అడ్వైజర్స్ సహకారంతో స్థానికులను సమన్వయపరచుకుని ఈ సహాయ సహకారాలను అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది, జనని టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గేట్స్ ఉపాధ్యక్షులు జనార్ధన్ పన్నెల మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో తోడ్పాటు అందించడానికి గేట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో ఎక్కడో అమెరికాలో ఉన్న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ కార్యవర్గం తమకు సహాయ కార్యక్రమాల ద్వారా తోడుగా నిలబడడాన్ని అందరూ అభినందించారు.