గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ మరియు 108 సూర్య నమస్కారాల టీం సంయుక్తంగా ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేట్ చేశారు. జూన్ 19 ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మందికి పైగా పాల్గొని ఇంటర్నేషనల్ యోగ డే ని విజయవంతం చేశారు.
2018 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ప్రవీణ్ మరిపెల్లి ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాల టీం వడోదరలోని గుజరాత్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా 108 సూర్య నమస్కారాలు చేశారు. పాల్గొన్న వారిలో వడోదర వాసులే కాకుండా అమెరికా మరియు కెనడా వాసులు కూడా ఉండడం విశేషం.
108 సూర్య నమస్కారాల టీం రెండు సెషన్స్ నిర్వహించారు. మొదటి సెషన్ జూన్ 19 సాయంత్రం ఆన్లైన్లో విదేశీయుల కొరకు నిర్వహించగా, రెండవ సెషన్ పెద్ద ఎత్తున వడోదరలోని గుజరాత్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. సుమారు 90 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేశారు.
గేట్స్ నాయకులు మరియు సభ్యులు ఇంటర్నేషనల్ యోగ డే రోజున 108 సూర్య నమస్కారాలు చేయడంలో పాల్గొన్నారు. మార్చి 12 నుండి జూన్ 19 వరకు ఉచిత యోగా మరియు సూర్య నమస్కారం తరగతులు కూడా నిర్వహించారు. నవీన్ బత్తిని, శ్రీదేవి మరియు అనిత నెల్లుట్ల ఈ సెషన్స్ ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అందరూ విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న గేట్స్ కార్యవర్గాన్ని మరియు 108 సూర్య నమస్కారాల టీం నుంచి ప్రవీణ్ మరిపెల్లి ని అభినందించారు.