పరిగెత్తుతున్న కాలం కాళ్ళకి కళ్ళెం వేయగలిగేదే సంతోషం. సంతోషాన్ని పంచే వేడుక ఓ సంబరం. అటువంటి ఓ సంబరాన్ని కళతో రంగరించి, ఆట-పాటలతో, మధుర మాటలతో, చిరునవ్వుల కాంతులను వెదజల్లుతూ ప్రతి మదినీ ఉల్లాసపరిచే విధంగా గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం ‘గాటా’ సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహించారు.
ఏ.బీ.ఆర్ ప్రొడక్షన్స్ వారి సౌజన్యంతో జూమ్ వేదికగా జనవరి 23 న ఆన్లైన్లో జరిగిన ఈ అద్భుత వేడుక సుమారు 4 గంటలు నిర్విరామంగా జరుగడం హర్షణీయం. కార్యక్రమం అత్యంత ఆకర్షణీయంగా సాగింది అనడానికి లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం అయిన అయిదు గంటల లోపే సుమారు 5000 వీక్షకులను ఆకట్టుకోవడం ప్రత్యక్ష నిదర్శనం. ఒక్కో గడియకు సవాలు విసురుతూ కరోనా కట్టడి చేస్తుండగా, సంక్షేమానికి ఆటంకం కలగకుండా అలాగే సాంప్రదాయం మరియు సంస్కృతికి లోటు కలుగకుండా గాటా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం సాంప్రదాయ రీతిలో జ్యోతి ప్రజ్వలన మరియు వినాయక స్తుతితో ఆరంభమొందింది.
తదుపరి నూతనంగా 2022 న అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన జయ చంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాటా సంస్థ పట్ల తమ గౌరవాభిమానాన్ని తాము ఈ సంవత్సరం నిర్వహించబోవు వినూత్న కార్యక్రమాల ద్వారా వ్యక్తపరచనున్నారని ప్రకటించడం అభినందనీయం. గాటా 2022 కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తూ సంస్థ గత సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలతో వీడియో ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు పలుకుతూ ఆలస్యానికి అదును ఇవ్వకుండా సాంస్కృతిక కార్యక్రమాలను మొదలుపెట్టారు.
వ్యాఖ్యాతగా గూడూరు లావణ్య తన మధుర వచనాలతో ఆకట్టుకుంటూ చిరునవ్వుల వదనముతో కార్యక్రమంలో ఆద్యంతం మరింత ఆహ్లాదాన్ని నింపారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూచిపూడి, భరతనాట్యం, జానపదం, పాశ్చాత్య వంటి పలు రకాల నృత్య కళాకారులు, కీర్తనలు, కృతులు, భజనలు, స్తోత్రాలు, శ్లోకాలు, చిత్రగీతాలు వంటి గానామృతమొలికించు గేయకారులతో, అభిమాన శుభాకాంక్షల ఝల్లులు కురిపించు ఆత్మీయులతో, ముత్యాల ముగ్గులల్లిన మురిపాల మగువలతో, సంప్రదాయం ప్రతిబింబించు వస్త్ర ధారణలతో ముద్దులొలుకు చిన్నారులతో గాటా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి అంటూ పలు ప్రశంసల వర్షం కురిపించారు వీక్షకులు.
సంస్థ స్థాపకులు తంగిరాల సత్యనారాయణ రెడ్డి మరియు సహ స్థాపకులు గొర్రెపాటి సాయి ఈ సందర్భంగా సంస్థ సమిష్ట కృషిని అభినందిస్తూ మార్గదర్శకంగా తమ సారథ్యం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియచెప్పారు. తెలుగువారందరి మనసుల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ తో ముఖాముఖి కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చింది. కిక్కిరిసిన వారి అభిమానుల వ్యాఖ్యలు యూట్యూబ్ లో సందడి చేశాయి. అంతేకాకుండా మధుర గాయినుల బృందం సిక్స్ స్ట్రింగ్స్, జానపద గేయ కారులు పన్నెల జనార్ధన్ ప్రదర్శనలు కార్యక్రమానికి కొస మెరుపుగా నిలిచి ప్రేక్షకులను చిందులేయించాయి. ఆన్లైన్ వేదిక పై జరిగిన ఈ కార్యక్రమం అత్యంత అంగరంగవైభవంగా జరిగింది.
చివరిగా సాంస్కృతిక కార్యకర్త పొద్దుటూరి నిరంజన్ ప్రసంగిస్తూ అత్యంత వైభవోపేతంగా రూపుదిద్దుకున్న కార్యక్రమానికి రూపకల్పన మరియు ప్రత్యక్ష ప్రసార బాధ్యతను నిర్వహించిన ఏ.బీ.ఆర్ ప్రొడక్షన్ బొద్దిరెడ్డి అనిల్ మరియు పాల్గొన్న చిన్నపెద్దలందరికీ, సహాయ సహకారాలు అందించిన వదాన్యులకు, స్వచ్చందకారులకు, గాటా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.