గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ ‘గాటా’ ఉగాది ఉత్సవాల వేదిక అంటూ సుమారు 1500 మంది హాజరయిన ఇంతటి ఘనమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులలో కొనియాడని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆత్మీయత తోరణాలతో అనురాగ ఆలింగనాలతో అపూర్వ ఆదరాభిమానాలతో సంప్రదాయ సాంస్కృతిక కళా వేదిక గా నిలిచి అట్లాంటా తెలుగు ప్రజల ఆనందాన్ని, అభిమానాన్ని కైవశం చేసుకుంది ఏప్రిల్ 9న దేశాన మిడిల్ స్కూల్లో జరిగిన గాటా ఉగాది ఉత్సవం.
ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఎవరెస్ట్ టెక్నాలజీస్ రవి కందిమళ్ల, ఇఐఎస్ టెక్నాలజీస్ కిరణ్ రెడ్డి పాశం మరియు కాకతీయ రెస్టారెంట్ వారి సౌజన్యంతో నిర్వహించబడిన ఈ వేడుక సంబరాల సంగమం. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి తో స్వాగతం పలుకుతూ, గణనాథుని ప్రార్థనతో ప్రారంభమైంది. కవి శ్రేష్ఠులు, అద్భుత గాయకులు అయిన శ్రీ ఫణి డొక్కా గారి పంచాంగ పఠనం, వివిధ శ్రవణానందకర సంగీత, సాహిత్య మరియు విభిన్న నయనానందకర నృత్య ప్రదర్శనలతో అనునిత్యం రంజనభరితంగా సాగుతూ భారతీయ తెలుగు సంప్రదాయానికి దర్పణంగా నిలిచింది.
శ్రావణి దర్శకత్వం మరియు నేపథ్యంలో ముద్దుగుమ్మలు మరియు మురిపాల యువత ముగ్ధమనోహరంగా మరియు వినూత్నంగా ప్రదర్శించిన సాంప్రదాయ వస్త్రధారణ విభాగము ప్రేక్షకుల దృష్టిని సమ్మోహన పరుచగా, లావణ్య గూడూరు మాటల అల్లరి అందరి మనసులను ఆకట్టుకోగ, నోరూరించే పర్వదిన ప్రత్యేక విందు సభాసదులను ఆసాంతం ఉల్లాస పరిచింది.
సుమారు 30 మంది అందాల తారల అద్భుత ప్రతిభా పాఠవాల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన గాటా మహాలక్ష్మి కార్యక్రమం విశిష్ఠ ఆకర్షణగా నిలిచి అందరి విశేష మన్నన పొందింది. ముఖ్యంగా యువత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణాంశం. ముచ్చటగా మూడు విభాగాల్లో సాగిన ఈ పోటీలో వివిధ అంశాల ఆధారంగా న్యాయనిర్ణేతలు విజేతలను ఎన్నుకోవడం పారదర్శకమంటూ పలువురు ప్రశంసించారు.
విజేతలకు అనూష వంగర మరియు నీలిమ సేన్ మకుట ధారణ చేస్తూ వారి సమర్పణలో ప్రత్యేక బహుమతులను సమర్పించారు. ఈ సందర్భంగా గాటా ప్రధాన కార్యదర్శి శ్రీ జయ చంద్ర గారు ప్రసంగిస్తూ వదాన్యులకు, స్వచ్ఛందకారులకు, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్య అతిథులకు, కళాకారులకు మరియు ఎల్లరి సహకారానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.
ప్రపంచానికే సవాలుగా నిలిచిన కరోనా కష్టకాలంలో అమెరికాలో చిక్కుకుపోయిన విజిటర్స్ కు ఉచితంగా ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి అహర్నిశలూ తమ సంపూర్ణ వైద్య సేవా సహకారాలను అందచేసిన డాక్టర్ నందిని సుంకిరెడ్డి, డాక్టర్ శ్రీహరి దాస్ కానూరు, డాక్టర్ సుజాత రెడ్డి మరియు మోహన్ రెడ్డి గార్లను ఈ సందర్భంగా గాటా ఈసీ, బోర్డు సభాసముఖంగా సన్మానించడం అభినందనీయం.
గాటా ఉగాది ఉత్సవం రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించి ఇంత అద్భుతంగా నిర్వహించిన అధ్యక్షులు జయ చంద్ర రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, లక్ష్మి సానికొమ్ము, వాసవి కర్నాటి, శ్రీలత శనిగరపు, స్వప్న కస్వా, మాధవి దాస్యం, సరిత చెక్కిల్ల, కిషన్ దేవునూరి, శేఖర్ రెడ్డి పల్ల, సిద్ధార్థ్ అబ్బగరి, సుబ్బారెడ్డి, శ్రీని శనిగరపు, నవీన్ రెడ్డి లకు గాటా ఫౌండర్స్ మరియు ఈసీ, బోర్డు తంగిరాల సత్యనారాయణ రెడ్డి, సాయి గొర్రెపాటి, గిరీష్ మేక, సత్య కర్నాటి ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.
సత్య కర్నాటి ఉల్లాసభరిత డీజే, శృతి చిత్తూరి ఫోటో బూత్, వాకిటి క్రియేషన్స్ ఫోటోగ్రఫీ, కాకతీయ రెస్టారెంట్ వారి విందు సమర్పణలకు, విక్రయదారుల సందడులకు గాటా బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ఇటువంటి మరెన్నో కళావేదికలను, సాంప్రదాయ సాంస్కృతిక వినోద కార్యక్రమాలను చేపట్టబోతున్న గాటా కు సకల జనుల సహకారం అందాలని ప్రార్థిస్తూ ఇంత అమోఘమైన కార్యక్రమాన్ని దేశభక్తి నిండిన హృదయాలతో భారత జాతీయ గీతంతో ముగించడం ముదావహం.
మరిన్ని ఫోటోల కొరకు ఈ వాకిటి క్రియేషన్స్ లింక్ ని సందర్శించండి.