Connect with us

Literary

సాహిత్య ప్రియుల సమక్షంలో తానా ఆధ్వర్యంలో స్వరరాగావధానం @ Dallas, Texas

Published

on

Dallas, Texas: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) నిర్వహించిన గరికపాటి వేంకట ప్రభాకర్ (Garikapati Venkata Prabhakar) గారి స్వరరాగావధానం కార్యక్రమం జూన్ 16 సోమవారం సాయంత్రం, డాలస్ (Dallas) నగరం దగ్గరలోని కాకతీయ లగ్షరీ బాంక్వెట్ హాల్ (Kakatiya Luxury Banquet Hall), లూయిస్ విల్ (Louisville) లో అనేక సంగీత సాహిత్య ప్రియుల సమక్షంలో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమనిర్వహణకు తానా (TANA) ప్రతినిధులు పరమేశ్ దేవినేని (Paramesh Devineni), రాజేశ్ అడుసుమిల్లి (Rajesh Adusumilli) నాయకత్వం వహించగా, మద్దుకూరి చంద్రహాస్ (Maddukuri Chandrahas) సంధానకర్తగా వ్యవహరించారు. ముందుగా తానా (TANA) సంస్థ తరఫున రాజేష్ ఆడుసుమిల్లి సభికులకు స్వాగతం పలికి, గరికపాటి ప్రభాకర్ (Garikapati Prabhakar) గారికీ తనకూ వున్నగురుశిష్య సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సంధానకర్త మద్దుకూరి చంద్రహాస్ స్వరరాగవధానం గురించి సభకు పరిచయం చేస్తూ, సంగీతసాహిత్య సమలంకృతంగా రాగాలతో తాళాలతో ప్రదర్శించబడే అపూర్వ చారిత్రాత్మక కార్యక్రమం స్వరరాగావధానం అని, ఇందులో స్ఫురణ ప్రేరణ ప్రధానమైనవని వివరించారు. అవధాని గానవిద్యాప్రవీణ స్వరశుభకర గరికపాటి వేంకట ప్రభాకర్ (Garikapati Venkata Prabhakar) శాస్త్రీయ సంగీతం సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా జనరంజంకంగా సమాజానికి అందించటమే తన లక్ష్యంగా చెప్పారు.

రాగమార్పు, రసమార్పు, తాళమార్పు, రాగమాలిక, నిషిద్ధస్వరం, స్వరాక్షరి, భావవర్ణన అనే అంశాల మీద వరుసగా చంద్రహాస్ మద్దుకూరి, ప్రభాకర్ కోట, రామకృష్ణ నేతి, జయ పండ్రంగి, విశాల అవధానం, సవిత నముడూరి, అనంత్ మల్లవరపు పృచ్ఛకులుగా అవధాని పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎంతో సమయస్ఫూర్తితో, సృజనాత్మకతతో, ప్రతిభావ్యుత్పత్తులతో, అప్పటికప్పుడు స్వరరచన చేస్తూ, రాగతాళరసాదులను మారుస్తూ, సామాన్యులకుకూడా అరటిపండు వలచి పెట్టినట్టు సంగీతరహస్యాలను వివరిస్తూ అవధాని గరికపాటి వేంకట ప్రభాకర్ (Garikapati Venkata Prabhakar) కార్యక్రమాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. భాస్కర్ రాయవరం (Bhaskar Rayavaram) మధ్య మధ్య అప్రస్తుత ప్రసంగంతో అవధాని గారిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించినపుడు సభలో నవ్వుల విరబూసాయి.

ఇది వారాంతం కానప్పటికీ హాలు పూర్తిగా నిండిపోయేలా ఆసక్తిగా అధిక సంఖ్యలో డాలస్ (Dallas, Texas) వాసులు ఈ కార్యక్రమానికి హాజరై అవధాని గారికి తమ హర్షాతిరేకాలను తెలియజేశారు. అనంతరం పుర ప్రముఖులు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura), ప్రఖ్యాత రచయిత పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Dr. Yarlagadda Lakshmi Prasad) ముఖ్య అతిథులుగా ప్రసంగించి నిర్వాహకులను, అభిమానులను, పృచ్ఛకులను, అవధాని గారిని అనేక విధాల ప్రశంసించారు.

తానా (TANA) నిర్వాహకవర్గం అవధాని గారిని సన్మానించడంతో కార్యక్రమం ముగిసింది.
మాడ దయాకర్ (Mada Dayakar) నిర్వహణలో డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, లెనిన్ వేముల పాల్గొన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) వారి నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం కూడా ఈ స్వరరాగావధానం తో అనుసంధానంగా జరగటం సభికులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

ఇంకా ఈ కార్యక్రమంలో తానా (TANA) కార్యవర్గం సభ్యులు మల్లి వేమన, సతీశ్ కొమ్మన, సతీశ్ కోటపాటి, మురళి వెన్నం, సుధీర్ చింతమనేని, వీర్నపు చినసత్యం మరియు టాంటెక్స్ (TANTEX) కార్యవర్గం సభ్యులు చంద్రా పొట్టిపాటి, నరసింహ పోపూరి, కొండా తిరుమలరెడ్డి, సురేష్ మండువ మొదలైన వారు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected