పోలాండ్‌లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ముందంజలో ఉన్న పోలాండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) ఆధ్వర్యంలో, క్రకోవ్ (Kraków) నగరంలో మూడవ వార్షిక వినాయక చవితి (Ganesh Chaturthi) మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభాయమానంగా నిర్వహించబడ్డాయి.
ఆగస్టు 27, బుధవారం నాడు గణపతి విగ్రహ ప్రతిష్టాపనతో ఈ వేడుకలు ప్రారంభమై ఐదు రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా కొనసాగాయి. ప్రతి రోజు హారతులు, దంపతుల పూజలు, గణేశ (Lord Ganesh) భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక మయంగా మార్చాయి. ఈ వేడుకలు పోలాండ్ (Poland) లోని తెలుగువారుకి సాంస్కృతిక వాతావరణాన్ని మరింత చేరువ చేశాయి.
భక్తుల సందడి
ఈ వినాయక వేడుకలు కేవలం తెలుగు వారిని మాత్రమే కాకుండా భారతదేశం (India) లోని వివిధ రాష్ట్రాల ప్రవాస భారతీయులను కూడా ఆకర్షించాయి. హిందూ సంప్రదాయాలపై ఆసక్తి చూపిన స్థానిక పోలిష్ ప్రజలు కూడా పాల్గొని బొజ్జ గణపతి (Lord Ganesh) విశిష్టతను తెలుసుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆచారాలు, సంప్రదాయాలు సరిహద్దులను దాటి మానవ సమాజాన్ని ఏకం చేసే శక్తి కలిగివున్నాయనే విషయం మరింత స్పష్టమైంది.
లడ్డు వేలం ప్రత్యేక ఆకర్షణ
వినాయక చవితి (Ganesh Chaturthi) మహోత్సవాల్లో భాగంగా జరిగిన లడ్డు వేలం (Laddu Auction) ఈ వేడుకకు విశేష ఆకర్షణగా నిలిచింది. ఇందులో మహిళల పాల్గొనడం విశేషం కాగా, స్వామివారి లడ్డును ₹1,37,700 వేల రూపాయలకు పొందడం విశేషంగా నిలిచింది.
PoTA బృందం శ్రమ అప్రతిహతం
ఈ మహోత్సవాలను ఘనవిజయవంతంగా నిర్వహించడంలో PoTA క్రకోవ్ చాప్టర్ (PoTA Krakow Chapter) సభ్యుల కృషి విశేషంగా నిలిచింది. కార్యక్రమ సమన్వయంలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ అల్లూరి, సుమన్ కుమార్ జనగామ, సత్య మండవల్లి, నవీన్ గౌడ్ కూరెల్లి, మౌనిక వేముల కూరెల్లి, దీక్షిత్ బాసాని, అజయ్ ఉప్పుల, పాలకోడేటి సాయి మౌనిక, మధుసూదన రెడ్డి ఉస్తిలి, సత్య లోకేష్ నున్న, విజయ్ సిరిపురం గారి నిబద్ధత, శ్రమ అందరి ప్రశంసలకు పాత్రమైంది.
సంస్కృతి పరిరక్షణకు అంకితభావం
విదేశీ నేలపై తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే దిశగా PoTA చేస్తున్న కృషి అభినందనీయమైనది. పోలాండ్ (Poland) లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పండుగ ఉత్సవాలను ఇలాగే ప్రతీ ఏటా మరింత ఘనంగా జరపబడతాయని PoTA (Poland Telugu Association) ప్రకటించింది.