Connect with us

News

నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు; ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు పురస్కారాలు @ Guntur, Andhra Pradesh

Published

on

భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు (Guntur, Andhra Pradesh) నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తొలుత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల (Potti Sriramulu) విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది.

ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష (Telugu Language) గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ (Telangana) ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది.

శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు (Guntur), కృష్ణా జిల్లాల నుండి జానపద (Folk), గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.

తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: బాపు నూతి

మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు (Cultural Programs) నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు.

అమెరికాలో నాట్స్ (NATS) తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష (Telugu Language) తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు.

కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద (Folk) సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు (Kalagara Sai Lakshmana Rao) కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను (Teachers) ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.. మహిళా సాధికారత (Women Empowerment) కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు.

అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామనేని

తెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ (NATS) అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని (Satya Sriramaneni) అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల (Universities) గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు (Kalagara Sai Lakshmana Rao) ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ (North America Telugu Society) ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి (Bapu Nuthi) సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు.

దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ (North America Telugu Society – NATS) చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు (Scholarships), ఉపాధ్యాయులకు (Teachers) ప్రోత్సాహించేలా పురస్కారాలు (Awards) అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు (MLC KS Lakshmana Rao) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానం

జానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు (NATS Awards) అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected