ఉత్తర అమెరికా లోని మిచిగన్ స్టేట్, సాగినా (Saginaw) నగరంలో గత సంవత్సరం ఆగష్టు 13న సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఆగష్టు కి మొదటి వార్షికోత్సవం అవ్వడంతో సెప్టెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక పూజలతో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ Sai Samaj Of Saginaw దైవేచ్ఛ కార్యక్రమంలో ప్రతి రోజూ గణపతి పూజ, సాయి హోమం, లలిత సహస్రనామ పారాయణం, నవగ్రహ హోమం, మంత్రపుష్పం, మంగళాషాసనం వంటి పూజలతో పాటు మహాప్రసాదం అందించనున్నారు.
2022 జనవరి నెలలో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యాన మందిరం ఎనిమిది నెలల్లోనే ఆగష్టు 2022 లో దేవాలయంగా (Sai Samaj Of Saginaw) రూపు దిద్దుకోవడం, మళ్ళీ ఇప్పుడు మొదటి వార్షికోత్సవం కూడా చేసుకుంటున్నందుకు చాలా ఆనందం గా ఉందని సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షులు డా. మురళి గింజుపల్లి అన్నారు.
మిచిగన్ (Michigan) రాష్ట్రం, సాగినా (Saginaw) నగర చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు సెప్టెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక పూజలతో నిర్వహిస్తున్న మొదటి వార్షికోత్సవ వేడుకలలో (First Anniversary Celebrations) పాల్గొని తీర్ధప్రసాదాలతోపాటు ఆ సాయినాధుని ఆశీస్సులు అందుకోవలసిందిగా కోరుతున్నారు.