కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన కట్టడమవడంతో ప్రస్తుత రద్దీకి తగ్గట్టు పునర్నిర్మాణం ద్వారా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎన్నారైలు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా దాతృత్వంతో పునర్నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి సరికొత్త రూపుదిద్దారు.
పునర్నిర్మాణం అనంతరం ఆగష్టు 21న మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన కలుగజేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా గత ఆగష్టు 4 గురువారం రోజున వేద పండితుల ఆధ్వర్యంలో వేరే దాత సమర్పించిన నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వివిధ పూజా పునస్కారాలు వైభవంగా నిర్వహించారు.
గణేశుని జయ జయ ద్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా తోపాటు ధ్వజస్తంభం దాత, పండితులు, ప్రభుత్వ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తులు విరివిగా పాల్గొన్నారు.
ప్రధాన ఆలయాన్ని 11 నుంచి 14 అడుగుల ఎత్తుకు పెంచారు. అలాగే గోపురాన్ని 22 అడుగుల నుంచి 28.6 అడుగులకు పెంచారు. గుడి లోపల భారతీయ సాంప్రదాయ కళలతో రూపొందించిన స్తంభాలను ఏర్పాటు చేశారు. గర్భ గుడి, మండపం, బలాలయం ఇలా అన్నిటినీ ఆధునీకరించారు.
వచ్చే ఆగష్టు 21 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల ముప్పై నిమిషాల నుండి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం అందించేలా ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆగష్టు 15 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి వివిధ పూజలు చేయనున్నారు.
చివరి రోజు ఆగష్టు 21న మహా కుంభాభిషేకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విచ్చేయనున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించే చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆ వరసిద్ధి వినాయకుని కటాక్షం అందుకోవాలని మనవి.