Singapore: శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ (Dr. Tadepalli Lokanatha Sharma) గారిచే, శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై శుక్రవారం సాయంత్రం మరియు ఆదివారం సాయంత్రం విశ్లేషణాత్మక ప్రసంగాలు ఏర్పాటు చేయబడ్డాయి.
వయోవృద్ధులు, అనుభవజ్ఞులు ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన తాడేపల్లి లోకనాథశర్మ (Dr. Tadepalli Lokanatha Sharma) సోదాహరణంగా కర్ణాటక సంగీత (Carnatic Music) ఆలాపనా విధానాలపై విశ్లేషణాత్మక ప్రసంగాన్ని సింగపూర్ (Singapore) తెలుగువారి కోసం ప్రత్యేకించి అందించారు.
“ఎప్పుడూ వివిధ శాస్త్రీయ, సినీ సంగీత కార్యక్రమాలను సింగపూర్ (Singapore) లో ఏర్పాటు చేస్తూనే ఉంటామని, కానీ తొలిసారి ఈ విధంగా వర్ధమాన గాయనీ గాయకులకు ఉపయోగపడే విధంగా శాస్త్రీయ సంగీత ఆలాపనా విధానాలపై మరింత అవగాహనను పెంచే విధంగా మెళకువలను నేర్పే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని” శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ (Kavuturu Ratnakumar) తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన విద్య సంగీతం మరియు స్వరలయ సంస్థలకు కృతజ్ఞతలు తెలియచేసారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విద్య సంగీతం నుంచి విద్యాధరి కాపవరపు మరియు ఆదివారం జరిగిన కార్యక్రమానికి స్వరలయ సంస్థ నుంచి శేషు యడవల్లి కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు.
డా. లోకనాథ శర్మ (Dr Lokanatha Sharma) తన విశ్లేషణాత్మక ప్రసంగంలో శాస్త్రీయ సంగీతానికి ఆయువుపట్టైన భావ ప్రకటన యొక్క ప్రాధాన్యతను గురించి వర్ణించారు. కచేరీలలో కేవలం తమ పాండిత్య ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా గాయనీగాయకులు పాటల యొక్క సాహిత్యంపై మరియు దాని భావంపై దృష్టి పెట్టాలన్నారు.
కీర్తనలలో హస్వాక్షరాలను రాగాలాపన కోసం సాగదీస్తే అర్థవంతంగా ఉండదన్నారు. గాత్ర సౌలభ్యం కోసం పదాలను నచ్చిన విధంగా విడదీయడం సబబు కాదన్నారు. మహా భక్తులైన త్యాగరాజు (Tyagaraja), అన్నమయ్య (Annamayya), రామదాసు (Ramadasu) వంటి వారి కీర్తనల విషయంలో భక్తిరసాత్మకంగా మాత్రమే ఆలపించాలన్నారు.
ఈ విధంగా వివిధ కీర్తనలను పాడుతూ సంప్రదాయబద్ధంగా ఏ విధంగా పాడాలో కూడా వర్ణిస్తూ వివిధ మెళకువలను తెలియజేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సోదాహరణ ఉదాహారణలతో సందేహ నివృత్తి చేసారు.సింగపూర్ (Singapore) లో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే విద్యార్థులు, గాయనీ గాయకులు, సంగీత పాఠశాలలు నడిపే గురువులు, శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉన్న తెలుగువారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి లోకనాథ శర్మ గారితో నేరుగా మాట్లాడి తమ సందేహనివృత్తి చేసుకున్నారు.
ప్రసంగానంతరం సంస్థ సభ్యులందరూ కలిసి లోకనాథ శర్మ (Dr. Tadepalli Lokanatha Sharma) గారిని ఉచితరీతిన సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’ కూడా కావడంతో వారాంతంలో ఇటువంటి ఉపయోగాత్మక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో తెలుగు భాగవత ప్రచార సమితి సింగపూర్ (Singapore) శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్ (Oolapalli Bhaskar), ఇండియా శాఖ అధ్యక్షులు ఊలపల్లి సాంబశివరావు (Oolapalli Sambasivarao) దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం అందరూ కలిసి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi)కార్యవర్గ సభ్యులు పాతూరి రాంబాబు మరియు శ్రీధర్ భరద్వాజ్ దగ్గరుండి భోజనఏర్పాట్లు సమకూర్చారు.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలందరికి పేరు పేరున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయనీ గణేశ్న, సుబ్బు వి పాలకుర్తి సాంకేతిక సహకారము అందించగా, ఈ కార్యక్రమం ప్రపంచంలోని సంగీతాభిమానులందరికీ కోసం శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi)యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబడింది.