Washington, D.C. : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి.నారాయణ రెడ్డి (Dr. C. Narayana Reddy) 94వ జయంతిని అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (Washington, D.C.) లో ఘనంగా నిర్వహించారు. తానా-పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిధులుగా.. ప్రముఖ రచయిత్రి శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) పాల్గొన్నారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులుగా, అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, సినీ గేయ రచయితగా అనేక భాద్యతలు సి.నా.రె నిర్వహించారు. తెలుగు సాహిత్యంలో, మకుటం లేని మహారాజుగా వెలుగొందారు..
తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాక, అనేక నూతన ప్రక్రియలను ఆవిష్కరించి, తెలుగు సాహితీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనే తపన అనేక అనర్థాలకు కారణమయింది. మనిషి ప్రకృతిని లోబరచుకొని, వనరులను దోచుకొని ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించటం వలన ప్రస్తుతం సమాజం అనేక సమస్యల్ని ఎదుర్కొంటుంది.
ప్రకృతితో మమేకమై సమతాస్థితిని సాధించటమే ఆయన రచించిన విశ్వంభర మనకిచ్చే అమూల్య సందేశం. తెలుగు సాహితి రంగాన్ని సినారె (Dr. C. Narayana Reddy) సుసంపన్నం చేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారు. వారి గజల్స్, కవితలు, పాటలు, పద్యాలు అన్ని కూడా..పేదల బ్రతుకులను,వారి దుర్భర జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు…అని వివరించారు.
ఈ కార్యక్రమంలో.. నక్షత్రం వేణు, పయ్యావుల చక్రవర్తి , చామర్తి శ్రావ్య, కొత్తూరి కామేశ్వరరావు , బోనాల రామకృష్ణ, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, దుగ్గి విజయ భాస్కర్, చల్లా సుబ్బారావు, చిట్టెపు సుబ్బారావు, చెరుకూరి ప్రసాద్, వనమా లక్ష్మి నారాయణ, మేకల సంతోష్ రెడ్డి, సామినేని వెంకటేశ్వర్రావు పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు..