అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో (Mar-a-Lago, Palm Beach, Florida) లోపలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగానిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా నిర్వహించిన షల్లీ కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్ లను ప్రత్యేకంగా అభినందించారు.
అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌబ్రాత్రుత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ (Donald J. Trump) ప్రస్తావించారు. భారతదేశం మరియు అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని, అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని, షల్లీ కుమార్ (Shalabh Shalli Kumar) ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం (India) ఎదుర్కుంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంబించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను వేరిపారేస్తామని తెలిపారు.
భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలో ఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు మరియు దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు.
అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ (Hindu Culture), సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలాషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.
దేశం కానీ దేశంలో కూడా తమ మూలాలను కాపాడుకుంటూ తమ వారికి ఏ చిన్న ఆపద వచ్చిన సంయుక్తంగా, భాష ప్రాతిపదిక సంఘాలుగా ఏర్పడి కూడా తమ వారి కష్ట నష్టాల్లో అండగా నిలుస్తూ, ఆదర్శంగా సాగుతున్న పలు ప్రవాస సంఘాల సారధులను సమన్వయము చేస్తూ విజయవంతం చేసినందుకు రిపబ్లికన్ హిందూ సమాఖ్య (Republican Hindu Coalition) వ్యవస్థాపకుడు షల్లీ కుమార్ ను, కార్యవర్గ సబ్భ్యులను తానా మాజీ అధ్యక్షులు ‘సతీష్ వేమన’ (Satish Vemana) ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ వేడుకలు ఇంత ఘనంగా సాగినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు.