Connect with us

Cricket

అక్షర సత్యం: భారతదేశ చరిత్రలో మొదటి సౌత్ ఇండియా దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ – Shashank Yarlagadda, TANA

Published

on

ఈ వార్త హెడింగ్ చూడగానే కొందరు అవునా నిజామా అని ఒక్క నిమిషం ఆలోచిస్తారు. కానీ ఇంకొక్క నిమిషం అలోచించి చరిత్రని తిరగేస్తే అవును నిజమే కదా ‘అక్షర సత్యం’ అంటారు. అదే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో నిర్వహించిన దక్షిణ భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్. ఒక తెలుగు సంఘం సౌత్ ఇండియా స్థాయిలో దివ్యాంగుల కోసం నిర్వహించడం మొట్టమొదటిసారే.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) లో భాగమైన డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCCI) లోని ఆంధ్రప్రదేశ్ వీల్ ఛైర్ & డిజబిలిటీ క్రికెట్ అసోసియేషన్ (APWDCA) తో సమన్వయం చేసుకొని తానా ఫౌండేషన్ ఆదరణ కార్యక్రమంలో భాగంగా వైజాగ్ లో డిసెంబర్ 9 నుండి 13 వరకు గీతం యూనివర్సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు.

ఒక డీమ్డ్ విశ్వవిద్యాలయం (GITAM University) అధ్యక్షులు, అమెరికాలోని ప్రఖ్యాత పర్డ్యూ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఎమ్. భరత్ (M Bharath) సైతం ఈ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ దగ్గిర నుండి ఫైనల్స్ అయ్యి, విజేతలకు కప్ అందించే వరకు శశాంక్ కి తోడుగా నిలిచారంటేనే తెలుస్తుంది ఈ టోర్నమెంట్ స్థాయి ఏంటో.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ టీవీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సైతం ఉదాత్తమైన క్రీడలను ప్రతి రోజూ పతాక శీర్షికల్లో కవర్ చేయడంలో పోటీ పడి మరీ విస్తృత ప్రచారం కల్పించాయి. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ లాంటి జాతీయ ఆంగ్ల పత్రికలు సైతం ప్రచురించడం విశేషం.

దక్షిణ భారత దేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల దివ్యాంగ జట్ల సభ్యుల ప్రయాణ ఏర్పాట్లు, రిసీవ్ చేసుకోవడం, భోజన ఏర్పాట్లు, వసతి విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఆటగాళ్లు సైతం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించారంటూ అభినందించడం కొసమెరుపు.

ప్రతి రోజూ ఉదయం 8 గంటల కల్లా స్టేడియం కి వెళ్లడం, క్రికెట్ మైదానాన్ని, గ్రౌండ్ లో ఉండాల్సిన పచ్చికను నిపుణులతో శుభ్రంగా రెడీ చేయించడం, మ్యాచ్ ల టైం కి గ్రౌండ్ స్టాఫ్ సహాయంతో ఆటగాళ్లను తీసుకురావడం, అల్పాహారం, లంచ్, స్నాక్స్, డిన్నర్, మ్యాచ్ ల అనంతరం హోటల్ కి తీసుకెళ్లడం, తానా జెర్సీలు వంటి పలు విషయాల్లో శశాంక్ చొరవ కనబరిచారు.

5 రోజుల పాటు 120 మందికి పైగా దివ్యాంగ క్రీడాకారులకు చక్కని సదుపాయాలు కల్పించి క్రీడా స్ఫూర్తి ని పెంపొందించడంలో శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda) సఫలీకృతం అయ్యారు. ఇదే స్ఫూర్తితో క్రీడాకారులు భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నీలో అడేలా ఆత్మవిశ్వాసాన్ని నింపారనడంలో ఎటువంటి సందేహం లేదు.

భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక తెలుగు సంఘం (TANA) సౌత్ ఇండియా స్థాయి దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది అంటే మామూలు విషయం కాదు. అందునా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం ప్రత్యేకం. ఈ మాటలు డిజబిలిటీ క్రికెట్ అసోసియేషన్ అధికారుల నోట రావడంతో 45 ఏళ్ళ తానా చరిత్రలో నూతన ఒరవడికి నాంది పలికినట్టైంది. ఈ సందర్భంగా శశాంక్ గురించి ఎమ్. భరత్ మాటల్లో వినాలంటే క్రింది వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే.

డిసెంబర్ 9 మొదటి రోజున గీతం యూనివర్సిటీ అధ్యక్షులు మరియు వైజాగ్ డిప్యూటీ మేయర్ శ్రీధర్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలైన ఈ మహత్తర వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్, ఐదు రోజులపాటు హోరాహోరీ మ్యాచ్లతో క్రీడాకారుల్లో మానసిక దృఢత్వం నింపింది.

డిసెంబర్ 13న ఫైనల్స్ లో కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఈ తానా సౌత్ ఇండియా దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్స్ లో 5 వికెట్ల తేడాతో గెలిచిన కర్ణాటక జట్టు సభ్యులు టోర్నమెంట్ ట్రోఫీ మరియు ప్రైజ్ మనీ అందుకున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీలు అందజేశారు.

గణనీయ రీతిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అధికారులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్న ఈ దక్షిణ భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ తో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలకు వన్నె తెచ్చారు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, దాతలు, వివిధ క్రికెట్ అసోసియేషన్ల అధికారులు, క్రీడాకారులు, అంపైర్లు, గీతం యూనివర్సిటీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు, గ్రౌండ్ సిబ్బంది తదితరులకు తానా యువతేజం శశాంక్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected