తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రతి సంవత్సరం ఎన్నో సేవ, విద్య, ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఇటు అమెరికా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. తానా చరిత్రలో మొట్టమొదటిసారి ఇప్పుడు ఇంకో కొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. దీనికి మూలవిరాట్ తానా క్రీడా కార్యదర్శి, యువతేజం శశాంక్ యార్లగడ్డ.
పెళ్లి కోసం ఇండియా వెళ్లిన శశాంక్, పెళ్లి అనంతరం తానా సేవాకార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. అదే వికలాంగుల క్రికెట్ పోటీలు. ఇండియాలో క్రికెట్ అందరికీ మక్కువైన క్రీడ. అలాంటి క్రీడ ని ఎంచుకొని వికలాంగులలో మనోస్థైర్యాన్ని పెంపొందించేలా మీకోసం తానా ఉందంటూ ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ ఛైర్ కప్’ పేరుతో ముందుకురావడం అభినందనీయం.
జనవరి 6న విశాఖపట్నంలో జరగనున్న ఈ వికలాంగుల క్రికెట్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జట్లు పోటీపడనున్నాయి. దీనికోసం ఇంకా ఇండియాలోనే ఉండి ఏర్పాట్లను సమన్వయపరుస్తున్నాడు శశాంక్.
ఇంతకుమునుపు కూడా సరికొత్తగా త్రీ ఆన్ త్రీ అంటూ కొత్త ఫార్మాట్ తో బాస్కెట్ బాల్ మరియు బ్రింగింగ్ బ్యాక్ అవర్ ట్రెడిషనల్ స్పోర్ట్ అంటూ కబడ్డీ ఛాంపియన్షిప్ లను విజయవంతంగా నిర్వహించి, కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలతో తానా కి మంచి పేరుతెస్తున్న కొత్త పెళ్ళికొడుకు అంటూ అందరూ శశాంక్ యార్లగడ్డనుఅభినందిస్తున్నారు.