విద్యని, కళలను ప్రదర్శించడానికి ఎంతటి ప్రతిభావంతులకైనా సరైన వేదిక ఎంతో ముఖ్యం. అప్పుడే వారు ఎంతో ఉత్సాహంగా తమలోని నైపుణ్యానికి మెరుగులద్దుకుని మరింత రాణించే అవకాశం ఉంటుంది. అటువంటి ఔత్సాహికులను ప్రోత్సహించి, జాతీయ స్థాయిలో వారి ప్రతిభకు సరైన గుర్తింపు లభించేలా చేసేదే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “ధీం-తానా” కార్యక్రమం.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలను పురస్కరించుకుని ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో ఈసారి మేరీలాండ్ లోని ఫ్రెడెరిక్ నగరంలో ఓక్ డేల్ హైస్కూల్ నందు TAM మరియు GWTCS సౌజన్యంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆద్యంతం తామై కూకట్ల సోదరుల (శ్రీనివాస్ కూకట్ల, వెంకట్ కూకట్ల, హరీష్ కూకట్ల) నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా కళాకారులు సంగీతం, నాట్యాభినయం, అందాల పోటిల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో పాల్గొని విచ్చేసిన సభికులందరి హర్షధ్వానాల మధ్య తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు.
ఈ ధీం-తానా పోటీలలో 50 మంది పాటలు ఆలపించగా, 25 మంది నృత్యం, మరియు 25 మంది కళ్ళు చెదిరే అందాల అతివలు నయనానందకరమైన అందాల పోటీల్లో పాల్గొన్నారు. పాటలు మరియు నృత్యాలు “సాంప్రదాయ” మరియు “సినిమా” విభాగాల్లో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధీం-తానా చైర్‌పర్సన్ మాలతి నాగభైరవ విచ్చేశారు. అందాల పోటీలకు 2021 మిస్ భారత్ USA అయిన మినాల్ మణికందన్ ఎంతో సహకారం అందించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సలహాదారుగా శ్రీమతి సాయిసుధ పాలడుగు వ్యవహరించారు.
అత్యంత పోటాపోటీగా సాగిన ఈ వేడుకల్లో విజేతలను నిర్ణయించడం కత్తి మీద సాములా ఉన్నా, ఆ బాధ్యతను చైతన్య పోలోజు గారు, సంధ్య బాయిరెడ్డి గారు, ఇంద్రాణి దావులూరి గారు, రవితేజ అయ్యగారి గారు, శ్వేత మరువాడ గారు, కార్తీక్ జయంతి గారు న్యాయ నిర్ణేతలుగా ఎంతో హుందాగా నిర్వర్తించారు.
ఇంకా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి విశేష కృషి చేసిన DC/Metro ప్రాంత ప్రజలందరికీ, పాల్గొన్న కళాకారులకు, వారి తల్లిదండ్రులకు, గురువులకు, నాగరజు దారంముక్కల గారికి, శ్రీనివాస్ సామినేని గారికి, హర్ష పెరమనేని గారికి, హర్ష మండవ గారికి, సంజయ్ పుచ్చకాయల గారికి, వినోద్ శేఖర్ గారికి, స్వర్ణ గుడ్ల గారికి Kukatla Brothers తానా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, కన్వీనర్ రవి పొట్లూరి గారికి, మరియు వాషింగ్టన్ డిసి తానా కార్యవర్గాన్ని అభినందించారు. ధీం-తానా లో పాల్గొన్న వారందరికీ తానా సంస్థ పసందైన తెలుగు భోజనం సమకూర్చగా, ఒక చక్కని సాయంకాలం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నామన్న అనుభూతితో సభికులందరూ ఆనందంగా వీడ్కోలు పలికారు.