శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై ఇండియా గెలుపుతో బోణీ కొట్టింది. కుర్రాళ్లతో మంచి ఊపులో ఉన్న టీం ఇండియా కెప్టెన్ ధవన్ (86 నాటౌట్), ఇషాన్ (59) అర్ధసెంచరీలతో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఛేదనలో ఇండియా 36.4 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అరంగేట్ర ఆటగాడు పృథ్వీ షా (24 బంతుల్లో 9 ఫోర్లతో 43) దక్కించుకున్నాడు.
ధవన్ శ్రీలంకపై తక్కువ ఇన్నింగ్స్ (17) లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్ గా, అలాగే ఈ ఫార్మాట్‌లో 6వేల పరుగులు పూర్తి చేసిన పదో ఇండియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. బర్త్ డే రోజు వన్డే అరంగేట్రం చేసిన రెండో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్. గతంలో గురుశరణ్ సింగ్ (1990) ఈ ఫీట్ సాధించాడు. అలాగే వన్డే అరంగేట్రంలో వేగవంతమైన (33 బంతుల్లో) 50 పరుగులు చేసిన ఇషాన్ రెండో క్రికెటర్ అయ్యాడు. అంతేకాకుండా భారత్ తరఫున టీ20, వన్డే అరంగేట్రంలోనూ హాఫ్ సెంచరీతో రాబిన్ ఊతప్ప సరసన నిలిచాడు.