ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు మరియు అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై అవగాహనను కల్పించనున్నారు.
దీంతోపాటు, వారికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా వివిధ పాఠశాలల్లో సిపిఆర్ (CPR), ఎఇడి (AED) శిక్షణ శిబిరాలను తానా ఫౌండేషన్ నిర్వహిస్తోందని ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) మరియు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
ఈ సంవత్సరంలోగా 100 పాఠశాలల్లో CPR (Cardiopulmonary Resuscitation) మరియు AED (Automated External Defibrillator) శిక్షణ శిబిరాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. గుంటూరు (Guntur, Andhra Pradesh) లో ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు 7 పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి ఈ శిక్షణ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. తానా న్యూఇంగ్లాండ్ రీజినల్ రిప్రజంటేటివ్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, డాక్టర్ ఓ.కె. మూర్తి ఈ అంశంపై విద్యార్థులకు అవగాహనను కల్పిస్తున్నారు.
భాష్యం, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లలో జరిగిన కార్యక్రమాలలో శ్రీనివాస్ ఎండూరి మాట్లాడుతూ… మనిషి గుండెపోటుకు గురైనప్పుడు అత్యనవసర వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని, అందుకోసం ఫౌండేషన్ ద్వారా ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నారైలు సూర్య తెలప్రోలు, దగ్గుబాటి సురేష్, కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్థన్, ప్రిన్సిపాల్ షఫీ, టొబాకో బోర్డ్‌కు చెందిన జీవిఆర్‌తోపాటు పాఠశాలల ఉపాధ్యాయులు ఇతరులు పాల్గొని ఈ CPR, AED శిక్షణా కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.