ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలలో తానా (Telugu Association of North America) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు స్వస్థలం పెద్దఅవుటపల్లిలో డిసెంబర్ 26, సోమవారం రోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పలువురు ప్రజా ప్రతినిధులు మరియు పుర ప్రముఖులతోపాటు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని 27 గ్రామాల ప్రజలు మరియు సమీప గ్రామాలైన గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం వాసులతో పెద్దఅవుటపల్లి కిక్కిరిసిపోయింది.
స్థానిక సెయింట్ జార్జ్ ఆర్.సి.ఎం పాఠశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు, ఉచిత వినికిడి పరీక్షలు, ఉచిత మెగా వైద్య శిబిరం, ఉచిత మెగా కంటి శిబిరాలలో అన్ని గ్రామాల ప్రజలు సేవలు వినియోగించుకున్నారు.
అనాధ బాలబాలికలకు ఉపకార వేతనాలు, రైతులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా నాయకులు మొక్కలు నాటారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అబివృద్ధి కొరకు లక్ష రూపాయలు దానం చేశారు. కిరణ్ కలపాల ఈ కార్యక్రమాల నిర్వహణలో సహకరించారు.
ఈ సేవాకార్యక్రమాలలో పాల్గొన్న పురప్రముఖులలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయులు, మాజీ రాజ్య సభ సభ్యులు కంభంపాటి రామ మోహనరావు, మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ విప్ ఆమదాలవలస కూన రవికుమార్, తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఉన్నారు.
అలాగే గన్నవరం శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు, మాజీ శాసనమండలి సభ్యులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ గుడా చైర్మన్ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబి, తెలుగుదేశం పార్టీ నాయకులు కేసీనేని చిన్ని, తెలుగుదేశం పార్టీ గుడివాడ నాయకులు రాము వెనిగండ్ల, రాష్ట్ర కార్యదర్శి కొనగళ్ల బుల్లయ్య, నీటి సంఘాల అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, తెలుగు మహిళ కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. సొంత గ్రామానికి సేవ చేసే అదృష్టం రావడం తన పూర్వజన్మ సుకృతమని, ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈరోజు విచ్చేసిన వివిధ ప్రజా ప్రతినిధులు, తానా ప్రతినిధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు సేవలను వినియోగించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే లావు ఫౌండేషన్ ద్వారా ముందు ముందు ప్రజలకు అవసరమైన మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
తానా నుంచి తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా కార్యదర్శి సతీష్ వేమూరి, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, 2023 మహాసభల కన్వీనర్ రవి పోట్లురి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర, తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఒరుగంటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అతిథులను, తానా నాయకులనుశాలువా, పూల బొకేలతో సన్మానించారు. పలువురు వక్తలు ప్రసంగిస్తూ తానా చేస్తున్న సేవలను కొనియాడారు. పెద్దఅవుటపల్లి కి అంజయ్య చౌదరి లావు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి గ్రామానికి ఒక ఎన్నారై సేవలు అందిస్తే బాగుంటుందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.