తానా, కళావేదిక, గుడ్ వైబ్స్ ఆధ్వర్యంలో “చిత్ర గాన లహరి” న్యూజెర్సీ (New Jersey) ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), గుడ్ వైబ్స్ ఈవెంట్స్ మరియు కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రం, ప్లెయిన్‌ఫీల్డ్ హై స్కూల్ ఆడిటోరియంలో జరిగిన తెలుగు సంగీత విహారం “చిత్ర గాన లహరి” ఘన విజయాన్ని సాధించింది.
పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర (K.S. Chithra) గారు, గాయకుడు శ్రీకృష్ణ (Singer Sri Krishna) మరియు ప్రతిభావంతమైన వాద్యకారులతో కలిసి ప్రదర్శించిన ఈ సంగీత కచేరీ సుమారు 2000 మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆడిటోరియం మొత్తం నాస్టాల్జియా, రాగాలు, భావోద్వేగాలతో నిండిపోయింది.
నాలుగు గంటలన్నర పాటు సాగిన ఈ సంగీత విహారం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పాత తెలుగు పాటలు, అద్భుతమైన సంగీత సమ్మేళనం, అభిమానుల చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్లతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. చాలా మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని “కాలేజీ రోజుల్ని గుర్తు చేసిన మధురస్మృతి”గా పేర్కొన్నారు.
కార్యక్రమం సందర్భంగా పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర గారికి న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు మరియు ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి (Sam Joshi) గారి చేతులమీదుగా న్యూజెర్సీ రాష్ట్రం మరియు ఎడిసన్ టౌన్షిప్ ప్రొక్లమేషన్లు (Edison Township Proclamation) అందజేయడం విశేషం.
తానా కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) గారు మాట్లాడుతూ, “న్యూజెర్సీ (New Jersey) లో ఈ అద్భుతమైన సంగీత విహారం నిర్వహించినందుకు చిత్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇటీవల డెట్రాయిట్ తానా కాన్ఫరెన్స్ (Detroit TANA Conference) లో ఆమె ఆరోగ్య కారణాల వల్ల పాల్గొనలేకపోయినా, ఈరోజు ప్రదర్శన ఆ లోటును పూరించింది,” అన్నారు.
అలాగే ఆయన కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి (Swathi Atluri) గారిని కళాకారులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు అభినందించగా, గుడ్ వైబ్స్ ఈవెంట్స్ అధ్యక్షురాలు స్రవంతి చుక్కపల్లి గారిని అద్భుతమైన సమన్వయం మరియు కార్యక్రమ నిర్వహణకు అభినందించారు.
కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి మరియు తానా (Telugu Association of North America – TANA) బోర్డు సభ్యుడు రవి పొట్లూరి (Ravi Potluri) గార్లు ఈ విజయవంతమైన కార్యక్రమంలో సహకరించిన ప్రేక్షకులు, స్థానిక సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ నరేపాలుపు, ఎడిసన్ సిటీ కల్చరల్ కోఆర్డినేటర్ ఉజ్వల్ కస్తాల, తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీలు (TANA Foundation Trustees) శ్రీనివాస్ ఒరుగంటి, సతీష్ మేకా, మరియు యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి సమన్వయపరిచారు. అలాగే తానా న్యూయార్క్ (New York) రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భరతవారపు, మిడ్ అట్లాంటిక్ రీజనల్ కోఆర్డినేటర్ ఫణి కంఠేటి తదితరులు పాల్గొన్నారు.
తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali) మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు (Srinivas Lavu) గార్లు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తానా బృందానికి, భాగస్వామ్య సంస్థలకు, వాలంటీర్లకు అభినందనలు తెలియజేస్తూ, “తెలుగు కళా, సంగీత పరంపరలను అమెరికాలో ప్రతిధ్వనింపజేసిన తానా గర్వకారణమైన కార్యక్రమం ఇది” అని పేర్కొన్నారు.