Connect with us

Telugu Desam Party

షార్లెట్ ఆత్మీయ సమావేశంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అమెరికా యాత్ర ఘనంగా ప్రారంభం

Published

on

మే 18 న షార్లెట్ నగరంలో అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం వైభవంగా నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.

బోస్టన్ లో ఈ నెల 20, 21 లలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు అందిన అతిధి ఆహ్వానం మేరకు ప్రభాకర్ చౌదరి మే 17న షార్లెట్ చేరుకున్నారు. షార్లెట్ లో అనంతపురం వాసులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఉండడంతో వారి కోరికను మన్నించి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మహానాడులో పాల్గొనేందుకు బోస్టన్ బయలుదేరి వెళ్లనున్నారు.

షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశాన్ని పురుషోత్తం చౌదరి గుడే, రవి నాయుడు, ఠాగూర్ మల్లినేని, వెంకట్ మాలపాటి, సచీన్ద్ర ఆవులపాటి, మహేష్ సూరపనేని, వెంకట్ సూర్యదేవర, కృష్ణ మరియు నరసింహ సమన్వయపరిచారు. ర్యాలీ నుంచి సురేష్ కాకర్ల, రామ్ అల్లు, సిద్ద కోనంకి, కేశవ్ వేముల తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పురుషోత్తం చౌదరి గుడే స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, పిల్లలు పుష్పగుచ్ఛంతో ప్రభాకర్ చౌదరి కి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, యువత తమ తమ ఆలోచనలను ప్రసంగ రూపంలో పంచుకున్నారు. అనంతరం ప్రభాకర్ చౌదరి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తీరు ఆహ్వానితులందరినీ ఆలోచింపజేసింది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన, విధివిధానాలు, అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు అందించిన చేయూత, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు, స్వలాభాపేక్ష లేకుండా ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు తెలుగుదేశం పార్టీ కి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైనం, అలాగే బోస్టన్ మహానాడు ఆహ్వానం తదితర విషయాలపై ప్రభాకర్ చౌదరి సుదీర్ఘంగా ప్రసంగించారు. అలాగే సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు అందించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్తలు ప్రభాకర్ చౌదరి ని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. శాలువాతో సత్కరించబోగా ఆ శాలువాను తిరిగి ఠాగూర్ మల్లినేని కి కప్పి, తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఠాగూర్ లాంటి వాళ్ళను ముందు సత్కరించాలని ప్రభాకర్ చౌదరి అనడంతో సభికులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు.

స్థానిక నేతలు పలువురిని పరిచయం చేస్తున్నప్పుడు కలివిడిగా తిరుగుతూ ప్రభాకర్ చౌదరి అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే మహిళలు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన తదనంతరం భోజనాలతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected