పెనమలూరు! ఇది కృష్ణా జిల్లా లో విజయవాడ (Vijayawada) ని ఆనుకొని ఉన్న ఒక గ్రామం. పేరుకే పంచాయతీ కానీ అక్కడ బడులు, గుడులు, ప్రజలు, సేవా కార్యక్రమాలు చూస్తే మాత్రం ఇదేదో పెద్ద పట్టణం అనుకుంటారు. దీనికి ముఖ్య కారణం పెనమలూరు నుంచి అమెరికాలో స్థిరపడి పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ ద్వారా ఠాగూర్ మల్లినేని మరియు వారి స్నేహితులు.
గ్రామానికి ఏ అవసరం వచ్చినా పెనమలూరు ఎన్నారైలందరినీ అలాగే ఇండియాలో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ అండగా నిలబడుతూ వస్తున్నారు ఠాగూర్ మల్లినేని. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ లో యాక్టివ్ గా ఉండడం, 2021 నుంచి మీడియా కోఆర్డినేటర్ గా సేవలు అందించడం కూడా కలిసివచ్చింది.
అందులో భాగంగానే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) చైతన్య స్రవంతి క్రార్యక్రమాలు పెనమలూరు కి కూడా తీసుకువచ్చారు. నిన్న డిసెంబర్ 24 శనివారం రోజున ఠాగూర్ ఆధ్వర్యంలో పెనమలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయాన్నే తానా నాయకులకు డప్పులు, కోలాటంతో మరియు కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. తానా నాయకులు ప్రధానోపాధ్యాయుని (Headmaster) ఆఫీసులో ఆసీనులై పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదట రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మరియు వినికిడి, చెవి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించే ఆరుణ్య క్యాంపు రోజంతా సాగాయి.
అనంతరం నిర్వహించిన సభలో 25 మంది మెరిట్ పేద విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా స్కాలర్షిప్స్ మరియు రైతు కోసం కార్యక్రమంలో భాగంగా పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రక్షణ పరికరాలను అందజేశారు. అలాగే ఆదరణ కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు అందించారు.
సభికులనుద్దేశించి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ… ఠాగూర్ లాగా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మీరు కూడా పెనమలూరు (Penamaluru) లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని విద్యార్థులకు హితబోధ చేశారు. తాను కూడా ఇలా పల్లెటూర్లో చదువుకునే అమెరికా వెళ్లానన్నారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ… తానా ఫౌండేషన్ తరపున చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్గా భవాని కోరిక మేరకు పెనమలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (High School) కు అవసరం అయిన బల్లలు మరియు ఇతర సామాగ్రి అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ… ఇప్పుడైనా ఎప్పుడైనా పెనమలూరు అభివృద్ధికి సహాయం చేసే విషయంలో తన స్నేహితులతో కలిపి ఇటు పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ ద్వారా అటు తానా ద్వారా ముందుంటామన్నారు. ఈ రోజు తానా చైతన్య స్రవంతిలో భాగంగా ప్రత్యేకంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా వేదికనలంకరించిన పెద్దలను, తానా నాయకులను శాలువా మరియు పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. తానా కార్యదర్శి సతీష్ వేమూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర, తానా అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి, తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, న్యూయార్క్ ఎన్నారైశ్రీనివాస నాదెళ్ళ, అనీల్ వీరపనేని, జోగేశ్వరరావు పెద్దిబోయిన, పవన్ దొడ్డపనేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం అందరినీ అలరించాయి. పెనమలూరు గ్రామ సర్పంచ్ భాస్కర్ లింగాల, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు అందరూ తానా నాయకులను మరియు ఠాగూర్ మల్లినేని తోపాటు ఈరోజు సహాయం అందించిన పెనమలూరు యువతను ప్రేత్యేకంగా అభినందించారు.
ఈ రోజు నిర్వహించిన సేవా కార్యక్రమాలలో స్థానిక మెడికల్ విద్యార్థిని సాయి వర్దిని కిలారు బృందం మరియు పెనమలూరు కు చెందిన సుధీర్ పాలడుగు, వర ప్రసాద్ మరీదు, నరేంద్ర బాబు మోర్ల, ప్రవీణ్ కిలారు, కోడూరు మహేష్ , కృష్ణ దావులూరి, సురేష్ కిలారు, సాంబశివరావు వీరంకి, తిరుమల గండరపు, గోపినాథ్ అర్చన, జావుల్లా రెహమాన్ షేక్ పాల్గొన్నారంటే స్థానికంగా ఉండే యువత ప్రమేయం కూడా ఉండేలా ఠాగూర్ చూస్తున్నట్లుంది.