Connect with us

Service Activities

1000 మంది నడుమ చిత్తూరు ఎమ్మెల్యే, మేయర్‌ సమక్షంలో చైతన్య స్రవంతి విజయవంతం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర, అట్లాంటా ప్రముఖ ఎన్నారై మోహన్ ఈదర మరియు ఆస్టిన్ టెక్సస్ ప్రముఖ ఎన్నారై హేమంత్ కూకట్ల సమర్పకులుగా చిత్తూరులో డిసెంబర్‌ 29న నిర్వహించిన పలు చైతన్య స్రవంతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

రాయలసీమలోని చిత్తూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, 2023 మహాసభల కన్వీనర్‌ రవి  పొట్లూరి, కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణిదల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, మల్లికార్జున్ వేమన తదితర తానా నాయకులు హాజరయ్యారు.

చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మేయర్‌ ఎస్‌ అముధ, ఎమ్మెల్సీ బి.ఎన్‌. రాజసింహులు, ఆర్టీసి వైస్‌ చైర్మన్‌ ఎం.సి. విజయానంద్‌ రెడ్డి, పులివర్తి నాని, డిప్యూటీ జడ్‌పి చైర్మన్‌ ధనుంజయ రెడ్డి, మాజీ జడ్‌పి చైర్మన్‌ చంద్ర ప్రకాష్‌, గాలి భానుప్రకాశ్‌, కఠారి హేమలత తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రెడ్‌క్రాస్‌ శాఖ సహకారంతో తానా చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, దివ్యాంగులకు, ఆర్థికంగా ఉపాధిపరంగా చేయూతనిచ్చారు. 100 మంది పేద ఉత్తమ విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున స్కాలర్‌ షిప్‌ లను  అందజేశారు. ఈ స్కాలర్‌ షిప్‌లను మోహన్‌ ఈదర స్పాన్సర్‌ చేశారు.

అలాగే 8 మంది మహిళలకు ఉపాధి కల్పన కోసం కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు. 15 మంది ఉత్తమ రైతులను సన్మానించడం తోపాటు వారికి అవసరమైన వ్యవసాయ రక్షణ పరికరాలను అందజేశారు. 18 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళను ఇచ్చారు. 30 మంది పేద ఉత్తమ విద్యార్థులకు సైకిళ్ళను బహుకరించారు.

ఈ వేడుకల్లో భాగంగా 10 మంది సంఘ సేవకులను ఘనంగా సన్మానించి సత్కరించారు. దాదాపు 60 మంది విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికిపైగా ప్రేక్షకులు హాజరై తానా నాయకులను అభినందించారు.

ఈ వేడుకల్లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తాము అమెరికాలో ఉన్నా జన్మభూమి అభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల్లో సేవ చేయాలన్న తలంపుతోనే ఉంటామని చెప్పారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.

తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర మాట్లాడుతూ, తానా, తానా ఫౌండేషన్‌ ద్వారా చైతన్యస్రవంతి కార్యక్రమాలు అన్ని చోట్ల ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. చిత్తూరులో కూడా తమవంతుగా సేవలందించాలన్న తలంపుతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి సహాయాన్ని అందించామని చెప్పారు.

తానా మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన మాట్లాడుతూ తానా (Telugu Association of North America) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అంటూ తామంతా అటు అమెరికాలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు ఎల్లప్పుడు సహాయపడుతుంటామని చెప్పారు.

తానా 2023 మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ తానా వచ్చే సంవత్సరం నిర్వహించే మహాసభలకు అందరూ రావాలని తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులకు సేవా పురస్కారాలను తానా అందజేసింది. బాలాజీ హేచరీస్‌ అధినేత వి.సుందరనాయుడు స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌, కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పార్థసారథినాయుడు, డాక్టర్‌ రామలక్ష్మి, డాక్టర్‌ రమాదేవి, శ్యామల, జోసెఫ్‌ను సేవా పురస్కారంతో సత్కరించారు.

తానా కళోత్సవంలో బిగ్‌బాస్‌ ఫేం గీతూ రాయల్‌ చిత్తూరు యాసలో మాట్లాడి అలరించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సునీల్‌ పంత్ర తోపాటు మోహన్‌ ఈదర, హేమంత్‌ కూకట్ల, ఉప్పలపాటి రమేష్‌ బాబు, చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం నేత లంకపల్లి మహదేవ నాయుడు, సాధు దిలీప్‌ కృషి చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected