Connect with us

Education

Melissa, Texas: NVL మెమోరియల్ లైబ్రరీకి పుస్తకాలు ప్రదానం, సమాజాభ్యుదయం పుస్తకాలతోనే సాధ్యం

Published

on

నాగరిత సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మంచితనం, మానవత్వం, సంస్కారవంతమైన సమాజాభ్యుదయం పుస్తకాలతోనే సాధ్యమవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కవి డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అమెరికాలోని డల్లాస్ (Dallas) నగరం మెలీసా (Melissa, Texas) లోని యన్.వి.యల్ స్మారక తెలుగు గ్రంథాలయం లో జరిగిన పుస్తక ప్రదానం కార్యక్రమంలో బాపూజీ గారు ముఖ్య అతిధిగా ప్రసంగించారు.

నాటి వేదాల నుండి నేటి రచనల వరకు వెలువడిన గ్రంథాలన్నీ మానవ జీవన వికాసానికి దోహదపడ్డాయన్నారు. గ్రంథాల ప్రాధాన్యతను గురించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యేంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం వంటి పెద్దలు గ్రంథాలయోద్యమాన్ని గ్రామ గ్రామాన విస్తరించి ప్రజల్లో పుస్తక పఠనాభిలాషను పెంచారన్నారు.

తెలుగు వారు గర్వాంగా చెప్పుకోదగిన వేటపాలెం లైబ్రరీ, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, గుంటూరు (Guntur) అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయాల స్ఫూర్తి తో అమెరికాకు చెందిన మన తెలుగు వ్యక్తి శ్రీ నలజుల నాగరాజు గారు తమ తండ్రి శ్రీ నలజుల వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం స్వగృహంలో తెలుగు లైబ్రరీని నెలకోల్పి పుస్తక సేవ చేస్తున్నందుకు అందరూ అభినందించాలన్నారు.

తమ తండ్రి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు బాల్యం నుండి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కల్గించినందునే తాను తెలుగు చదివి, తెలుగు (Telugu) బోధించి, తెలుగు కవిగా రచనలు చేయగలిగానని జయకృష్ణ బాపూజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ విద్యావేత్త పోణంగి గోపాల్ (Gopal Ponangi) గారు అధ్యక్షతవహించారు.

యన్.వి.యల్ మెమోరియల్ తెలుగు లైబ్రరీ స్థాపనలో తమ ఫౌండేషన్ నూ భాగస్వామిని చేసినందుకు నాగరాజు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథకర్త పింగళి పాండురంగారావు గారు ఒంగోలు నుండి పంపిన 10 వేల రూపాయల విలువైన స్వీయ రచనలను అతిథులు యన్.వి.యల్ లైబ్రరీ స్థాపకులు నలజుల నాగరాజుకు అందచేశారు.

92 సంవత్సరాల వయసులో స్వంత ఖర్చుతో అమెరికాలోని తెలుగు లైబ్రరీకి పుస్తకాలు పంపిన పాండురంగారావు గారికి పుస్తకాల పట్ల వున్న గౌరవాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. పుస్తకస్వీకర్త నాగరాజు (Nagaraju Nalajula) గారు సభాముఖంగా పాండురంగారావు గారికి ధన్యవాదాలు తెలిపారు.

తరువాత ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి డా. బల్లూరి ఉమాదేవి తమ స్వీయ రచనలను లైబ్రరీ (Library) కి బహూకరించి ప్రసంగించారు. మరో ప్రముఖ రచయిత్రి సింధుమాధురి తమ వద్ద వున్న 2 వేలకుపైగా విలువైన పుస్తకాలను యాన్.వి.యల్ లైబ్రరీకి బహూకరిస్తానని సభాముఖంగా ప్రకటించారు.

శుభం ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ తడపనేని, తానా ప్రతినిధి మల్లి వేమన (Malli Vemana), ప్రముఖ వైద్యులు డా. విజయ్ కఠారి, డా. ఫణి, కవి జంధ్యాల శ్రీనాథ్, రిటైర్డ్ హెడ్మాష్టర్ పురుషోత్త రెడ్డి, భరత్, వెంకట్ చెరుకూరి, అవనీంద్ర లింగా, కిరణ్ మువ్వా, నాగరాజు కుటుంబ సభ్యులు సునీత, గణేష్, గాయత్రి, కవిత, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

అతిథులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ కవి డా. బీరం సుందరరావు గారు తొలుత అతిథులకు స్వాగతం పలికి సభను నిర్వహించారు. డల్లాస్ (Dallas, Texas) నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పుస్తక ప్రేమికులు సభకు హాజరయ్యారు.

error: NRI2NRI.COM copyright content is protected