Andhra Pradesh: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువుతున్న తల్లితండ్రులు లేని పిల్లలలకు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, కర్నూల్ ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ రవి పొట్లూరి (Ravi Potluri) ఆధ్వర్యంలో వరుసగా ఐదవ సంవత్సరం రూ. 10 లక్షల రూపాయల విరాళాన్ని పాఠశాల యాజమాన్యానికి మంగళవారం డిసెంబర్ 10 నాడు అందజేశారు.
2020 లో ఇచ్చిన హామీ ప్రకారం దాతలు, మిత్రులు, సహారా మినిస్ట్రిస్, తానా ఫౌండేషన్ (TANA Foundation) సహకారంతో గత ఐదు సంవత్సరాల్లో బాలభారతి పాఠశాలకు యాభై ఐదు లక్షల రూపాయల విరాళం అందించినట్లు పొట్లూరి రవి తెలిపారు. అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు (NRIs) ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా టీడీపీ (Telugu Desam Party) సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గౌరు వెంకట్ రెడ్డి (Gowru Venkata Reddy) తెలిపారు.
రవి పొట్లూరి స్పూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) సోదరుడు, ఎన్నారై జగదీశ్వర్ రెడ్డి అనుముల మాట్లాడుతూ… బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ (Kurnool NRI Foundation) సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు.
రవి పొట్లూరి (Ravi Potluri) ఆధ్వర్యంలో ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, సందడి మధు, వైస్ ప్రిన్సిపాల్ సవ్య, పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కార్యవర్గం, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల నాయకులు రామ భూపాల్ రెడ్డి, ఎస్సి సెల్ నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.