Connect with us

Sports

చరిత్ర పుటల్లో Fortius అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్, PV Sindhu హాజరు తీపి జ్ఞాపకం @ Alpharetta, Georgia

Published

on

Alpharetta, Georgia: అత్యాధునిక క్రీడా ప్రాంగణంగా పేరు పొందిన ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) ఆధ్వర్యంలో నవంబర్ 14, 15 మరియు 16 తేదీల్లో అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్ (ABO) 2025 ని నిర్వహించారు. అమెరికాలోనే అతి పెద్ద బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌గా చరిత్ర పుటల్లో నిలిచింది.

మూడు రోజులపాటు సాగిన ఈ భారీ క్రీడా ఉత్సవం, విభిన్న రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది క్రీడాకారులతో నవంబర్ 14 శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైంది. చిన్న, పెద్ద, మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా అన్ని వయసుల ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ (Badminton Tournament) లో మూడు రోజులపాటూ పాల్గొనడం విశేషం.

అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకున్న ఫోర్టియస్

ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులకు ప్రసిద్ధి. బ్లూ మాట్స్ తో విశాలమైన 22 కోర్టులలో ఈ టోర్నమెంట్‌ సజావుగా సాగడంలో ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) కీలక పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ప్రతి కోర్ట్‌లో టెక్నికల్ టీమ్స్, మ్యాచ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, ప్రేక్షకుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, పిల్లల కోసం ప్రత్యేక విశ్రాంతి ప్రదేశాలు, అన్నీ పాల్గొన్నవారి ప్రశంసలను అందుకున్నాయి. “ఇంతలా ప్రొఫెషనల్ సెటప్ చాలా అరుదుగా చూస్తాం. ఫోర్టియస్ టీం చేసిన ప్లానింగ్, సమన్వయం అద్భుతం.” అంటూ పిల్లల తల్లిదండ్రులు, ప్లేయర్స్, కోచ్‌లు ప్రశంసించారు.

పీ.వి.సింధు హాజరు, ఆటగాళ్లకు తీపి జ్ఞాపకం

టోర్నమెంట్ రెండో రోజు నవంబర్ 15 శనివారం ఉదయం నుంచే క్రీడలు సాగగా, సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ప్రపంచ చాంపియన్ (World Champion), ఒలింపిక్ పతాక విజేత (Olympic Medalist) పీ.వి. సింధు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఈ టోర్నమెంట్ కి మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. పీ.వి.సింధు (PV Sindhu) యువ క్రీడాకారులకు ప్రేరణాత్మక ప్రసంగం ఇచ్చారు.

ఫైర్ సైడ్ చాట్ లో భాగంగా పీ.వి.సింధు (Pusarla Venkata Sindhu) కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై తన అనుభవాలను పంచుకున్నారు. వందలాది అభిమానులు మరియు ఆటగాళ్లతో ఫోటోలు దిగారు. చిన్నారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆమె హాజరు వలన టోర్నమెంట్ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.

పీ.వి. సింధు (PV Sindhu) ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యత్వం తీసుకోవడం కొసమెరుపు అనుకునేలోగా, వచ్చే సంవత్సరం తిరిగి అట్లాంటా (Atlanta) వచ్చినప్పుడు ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ బ్యాడ్మింటన్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పి అందరినీ ఖంగు తినిపించారు.

ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కమిటీ కృషి ప్రశంసనీయం

ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) టీం, కోచ్‌లు, సాంకేతిక నిపుణులు స్టేజింగ్ ఏరియా అంటూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ టోర్నమెంట్‌ను ప్రతీ నిమిషం సమర్థవంతంగా నడిపించారు. సమయపాలన, పారదర్శక స్కోరింగ్ సిస్టమ్ వంటి కీలక అంశాలపై ద్రుష్టి కేంద్రీకరించడం అభినందనీయం.

ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ మానేజ్మెంట్ సభ్యులు మాట్లాడుతూ… “యువ ప్రతిభను వెలికితీయడం, వారికి అంతర్జాతీయ స్థాయి వేదిక ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం. ఈ సంవత్సరం పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య మా దిశలో ముందడుగని నిరూపిస్తుంది. క్రీడా ప్రేమికులకు చిరస్మరణీయమైన టోర్నమెంట్ అందించడం మా ప్రత్యేకత.” అని అన్నారు.

టోర్నమెంట్‌లో 40+ కేటగిరీలు ఉండటం విశేషం. అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, మెన్స్ & ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, అడ్వాన్స్డ్ ఇలా పలు కేటగిరీలలో క్రీడాకారులు పోటీపడ్డారు. ప్రతి విభాగంలో కూడా గట్టి పోటీ మరియు సృజనాత్మకత స్పష్టంగా కనబడింది.

ప్రతి రోజూ అట్లాంటా పక్కా లోకల్ (ATL Pakka Local) రెస్టారెంట్, పీచ్ కార్నర్స్ కేఫ్ (Peach Corners Cafe), స్ట్రెచ్ ల్యాబ్ (Stretchlab) వారు తమ వెండర్ బూత్స్ ని ఏర్పాటు చేశారు. చివరి రోజైన మూడోరోజు, నవంబర్ 16 ఆదివారం మధ్యాహ్నం నుండి విజేతలకు స్పోర్ట్స్ గేర్, మెడల్స్, పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్, క్యాష్ ప్రైజ్ చెక్కులు వగైరా పెద్దల చేతుల మీదుగా అందించారు.

ABO టోర్నమెంట్ ప్రత్యేకతలు

మొత్తం మ్యాచ్‌లు: 550+
పాల్గొన్న క్రీడాకారులు: 460+
క్లబ్‌లు: 100+
విభాగాలు: 40+
బహుమతులు: $25K+
కోర్టులు: 22

ఈ గణాంకాలు టోర్నమెంట్ గొప్పతనానికి నిదర్శనం ని పలువురు కొనియాడారు. కొందరు ప్లేయర్స్ వీడియో ముఖంగా ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీని (Fortius Sports Academy) అభినందించడం కాకతాళీయం. మొత్తం మీద ఫోర్టియస్ అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్ (Atlanta Badminton Open) 2025 ఒక అత్యంత విజయవంతమైన క్రీడా ఘట్టంగా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected