Published
9 minutes agoon
By
Sri Nexus
Hyderabad, Telangana: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 27, 2025 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన సేవా, విద్యా, సాంస్కృతిక, వ్యాపార కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందనను పొందాయి. ప్రవాస తెలుగువారి ఐక్యత, మాతృభాష, సంస్కృతి పరిరక్షణ, సమాజ సేవే లక్ష్యంగా ఆటా చేపట్టిన ఈ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా కొనసాగాయి.
డిసెంబర్ 11న ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆటా నిర్వహిస్తున్న విద్యా, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, యువత అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రవాస తెలుగువారి పాత్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని మంత్రి ప్రశంసిస్తూ, భాషా, సంస్కృతి పరిరక్షణలో ఆటాకు ప్రభుత్వ స్థాయి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆటా మహాసభలకు ఆహ్వానాన్ని స్వీకరించారు. డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా (ATA) సేవా కార్యక్రమాలపై హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా జయంత్ చల్లా, సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, స్కాలర్షిప్లు, విద్యా సెమినార్లు (Educational Seminars), యువజన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఆరోగ్య శిబిరాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 27న రవీంద్రభారతిలో గ్రాండ్ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయని ప్రకటించారు.

డిసెంబర్ 12న రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆటా ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల (Scholarships) పంపిణీ జరిగింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు ఆటా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
టీయూఎఫ్ఐడీసీ (TUFIDC) చైర్మన్ చల్ల నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 33 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవలు కొనసాగుతున్నాయని ప్రతినిధులు గుర్తు చేశారు. డిసెంబర్ 13న ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన ఆటా స్టార్టప్ పిచ్ డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైతీ స్టార్టప్ హబ్ సీఈఓ డా. పీఎస్ మదనగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలే భవిష్యత్ ఆర్థిక వృద్ధికి పునాదని తెలిపారు.

స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు ఒకే వేదికపైకి రావడం ద్వారా గ్లోబల్ అనుసంధానం ఏర్పడిందని ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు. డిసెంబర్ 14న సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా (ATA) అంతర్జాతీయ సాహిత్య సదస్సు–2025 ఘనంగా జరిగింది. తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ బాధ్యత అందరిదేనని వక్తలు పిలుపునిచ్చారు.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల రచనలపై జరిగిన చర్చలు మేధావులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 15న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) ని ఆటా ప్రతినిధులు దర్శించుకొని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

డిసెంబర్ 17న విశాఖలో జరిగిన వాణిజ్య సదస్సులో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) మాట్లాడుతూ, గూగుల్ వంటి సంస్థల పెట్టుబడులు విశాఖ అభివృద్ధికి శుభసూచకమన్నారు. 19వ ఆటా మహాసభలకు వచ్చే ఏడాది జూలై 31న హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
యువత భాగస్వామ్యం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మహాసభల ప్రధాన లక్ష్యాలని వివరించారు. డిసెంబర్ 19న డల్లాస్ కాల్పుల్లో కొడుకును కోల్పోయిన తల్లికి ఆటా భరోసా ఇచ్చింది. గోఫండ్మీ (GoFundMe) ద్వారా సేకరించిన రూ.50 లక్షలను కుటుంబానికి అందజేస్తామని ప్రకటించింది.

అనంతరం హైదరాబాద్ టి-హబ్ (T-Hub) లో నిర్వహించిన బిజినెస్ సెమినార్లో హైదరాబాద్ గ్లోబల్ ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ముఖ్య అతిథిగా హాజరైన యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైజింగ్ స్టేట్గా మారిందని పేర్కొన్నారు. అదే రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆటా వేడుకలు–2025 గ్రాండ్ ఫినాలేకు, 2026లో అమెరికాలో జరిగే మహాసభలకు ఆహ్వానించారు.
డిసెంబర్ 20 నుంచి 24 వరకు పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, పాఠశాల అభివృద్ధి, మహిళల ఆరోగ్యం, ఆరోగ్య శిబిరాలు, ఆలయ ప్రారంభోత్సవాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబ్నగర్, సూర్యాపేట, సిద్ధిపేట తదితర జిల్లాల్లో ఆటా (ATA) సేవలు ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.

డిసెంబర్ 27న హైదరాబాద్ (Hyderabad) రవీంద్రభారతిలో ‘ఆటా వేడుకలు–2025 గ్రాండ్ ఫినాలే’ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) ముఖ్య అతిథిగా హాజరై, ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు తీసుకొస్తున్న ఆటా సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు ఏ. కోదండరాం రెడ్డికి ఆటా జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ తోపాటు హాజరైన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు, కార్పొరేషన్ చైర్మెన్లు నరసింహారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఆటా (ATA) ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. అవార్డు గ్రహీతల్లో యడ్లపల్లి వెంకటేశ్వరరావు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి (సామాజిక సేవ), దీపికా రెడ్డి (పర్ఫార్మింగ్ ఆర్ట్స్), డా. ఈ. శివనాగి రెడ్డి (తెలుగు సాహిత్యం & విద్య), అయ్యగారి శ్రీదేవి, దాసరి శ్రీలక్ష్మి రెడ్డి, కల్యాణి ద్విభాష్యం, డా. రమ్య సౌజన్య, డా. ములే రామముని రెడ్డి, పి. నరేందర్ రెడ్డి, ఏ. లోహిత్ కుమార్, హరినాథ రెడ్డి, మాస్టర్ గండ్రెట్టు తపాస్ తదితరులు ఉన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఆటా వేడుకలకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు వున్నారు.
మొత్తంగా ఆటా (American Telugu Association – ATA) వేడుకలు–2025 తెలుగు భాష, సంస్కృతి, సేవ, విద్య, వ్యాపార రంగాల్లో ఆటా పాత్రను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు అని పలువురు వక్తలు వారి భావనను వ్యక్తం చేశారు.
























