Connect with us

Literary

అతులిత ఆనందానుభూతిని కలిగించిన తెలుగు వసంతం: ATA ఉగాది సాహిత్య వేదిక

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, 2024 న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి (Sharada Singireddy) సారథ్యంలో నిర్వహింపబడిన శ్రీ క్రోధి నామ సంవత్సర “తెలుగు వసంతం” సాహితీ (Literary) ప్రియులకు, తెలుగు భాషాభిమానులకు మరియు భావాభిమానులకు అతులిత ఆనందానుభూతిని కలిగించింది.

పూజ్యులు, త్రిభాషా మహాసహస్రావధాని , శ్రీ ప్రణవ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ (Brahmasri Vaddiparti Padmakar) గారు, జాతీయ సాహిత్య రథసారథి, పూర్వాధ్యక్షులు , తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు శ్రీ ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, పౌరాణిక ప్రవర, ప్రవచన చక్రవర్తి, శ్రీ శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, పద్య శిల్పి, అధ్యక్షులు, పద్య సారస్వత పీఠం, సాహితీ కళా ప్రవీణ శ్రీ అవుసుల భానుప్రకాష్ అవధాని, సినారె వాగ్భూషణ పురస్కార గ్రహీత, అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ గార్ల సాహితీ కిరీటుల కమనీయ సాహిత్య సుధామృతముతో తెలుగు భాషకు అభిషేకం జరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో గణనాథుని కీర్తనతో రాలీ, నార్త్ కరోలీనా (North Carolina) నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన, సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం కరుణించిన తెలుగు తల్లి చిరు మందహాసంలా, లేలేతచిగురు వన్నె ఆకర్షణలా, వీక్షకుల హృదయాంతరాలను మీటుతూ భావ లహరిలో విహరింపచేసింది అంటూ ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది.

కార్యక్రమాన్ని ఆశీర్వదించి మహోన్నతంగా సఫలీకృతం గావించిన విశిష్ఠ సాహితీ శ్రేష్ఠులకు ప్రణమిల్లుతూ, నిర్వహించడానికి సహకరించిన ఆటా సాహితీ సభ్యులకు, అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని (Madhu Bommineni) ప్రత్యేక అభినందనలను తెలియజేస్తూ 2024 సంవత్సరం అట్లాంటా (Atlanta) లో జూన్ 7,8,9 తేదీలలో జరుగనున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA Convention & Youth Conference) కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు.

సుమారు మూడు గంటలు నిరాటంకంగా సాగిన ఈ అద్భుత కార్యక్రమమునకు శ్రీ నంది శ్రీనివాస్ గారు చెరగని చిరునవ్వుతో వ్యాఖ్యాతగా వ్యవహరించగా పూజ్య అతిథులు అంతే ఉత్సాహంతో ఆద్యంతం తమ తేజో వర్ఛస్సులతో , సహకరించడం ముదావహం. చివరిగా ఆటా (American Telugu Association) లిటరరీ సభ్యులు మాధవి దాస్యం (Madhavi Dasyam) విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతాంజలులు తెలుపుకుంటూ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన వారందరికీ పేరుపేరునా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected