Connect with us

News

తానా ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న అంజయ్య చౌదరి లావు, హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్న తెలుగువారు

Published

on

అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా (2021-23) బాధ్యతలు స్వీకరించిన మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా స్వాగతిస్తున్నారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత, నిబద్దత, మంచితనం, మానవతా దృక్పథం, సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం, కాలంతో పోటిపడుతూ పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగించడం ఆయన నైజం. తెలుగు వారి పట్ల అవ్యాజ్యమైన ప్రేమను చూపించే అంజయ్య చౌదరి వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే ఒక యోధుడు. డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా ఒక పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు మాత్రమే కాకుండా అమెరికాలోని తెలుగువారి కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి, వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి కి తెలుగు వారందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవడమే అంజయ్య చౌదరి నిస్వార్థ లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసమే ఆయన అనునిత్యం ఆరాటపడుతుంటారు.

మనిషితనమే మంచితనం అని నమ్మే అంజయ్య చౌదరి

అందరికీ అందుబాటులో ఉండటం, మంచి ఎవరు చెప్పినా దాన్ని స్వీకరించి ఆచరించడం నాయకుడికి ఉండాల్సిన బలమైన గుణం. అటువంటి సుగుణాల సమాహారమే అంజయ్య చౌదరి. తాను ఎటువంటి పదవిలో ఉన్నా భేషజం లేకుండా, కొత్త పాత అనే తారతమ్యాలు లేకుండా ఆదరిస్తూ, ప్రోత్సహించడమే కాక మనిషితనమే మంచితనం అనే ఏకైక ఎజెండా కలిగిన వ్యక్తిత్వం అంజయ్య చౌదరి సొత్తు. “డబ్బుల సంచి కన్నా.. పంచిన మంచి మిన్న” అని ఆయన నమ్మడమే కాక నలుగురికీ ఎప్పుడూ చెప్పే మంచి మాట.

ఇప్పటికే అందరివాడిగా మన్నన పొందిన అంజయ్య చౌదరి యువతరానికి, అనుభవానికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ తానా చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించే దిశగా అడుగులేయబోతున్నారు. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహిస్తూ అమెరికాలో తెలుగువారి గుండె చప్పుడైన “తానా” ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తారని అందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. అంజయ్య చౌదరి తానా ప్రస్థానం ఒకసారి గమనిస్తే ఆయన అంచెలంచెలుగా ఎదిగిన వైనం, సేవా భావంతో ఆయన నడిచిన మార్గం ఆయన వ్యక్తిత్వ విశిష్టతను ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి.

సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటు అందిస్తున్న అంజయ్య చౌదరి

తను జన్మించిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెద అవుటపల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా రోగాలు నయం చేస్తున్నారు. ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి, సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు.

తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద అవుటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి. “ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల” అని నమ్మి ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు. మిత్రులు, సహృదయుల వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాథ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో అంజయ్య చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు.

“ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” నానుడిని విశ్వసించే అంజయ్య చౌదరి

పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది. అమెరికన్ రెడ్ క్రాస్ మరియు ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాల్లో తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను సమకూర్చడం వంటి సహాయాలెన్నో చేశారు. “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయపడటం, వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే మూల సూత్రాలంటారు అంజయ్య చౌదరి.

“విలువలే మనిషికి వలువలు” అనే విషయాన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి అంజయ్య చౌదరి. మనుషులందరూ ఈ భూమి మీద అతిథులే. మనకి తోచిన మంచిని పంచి మానవత్వపు విలువలకు సొబగులద్ది నిష్క్రమించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యమని చెప్పడమే కాక మనుషులు స్వలాభం, స్వార్థం కోసం జీవించకుండా కష్టపడి అభివృద్ధిని సాధిస్తూ ప్రేమను, ఆప్యాయతను నలుగురికీ పంచడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని నమ్మిన వ్యక్తిత్వం అంజయ్య గారిది. రానున్న రోజుల్లో “తానా” కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు , తానా కీర్తిని దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దాం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected